Grand Vitara S-CNG | మారుతి సుజుకి తన మిడ్ సైజ్ ఎస్ యూవీ మోడల్ కారు గ్రాండ్ విటారాను ఎస్-సీఎన్జీ వర్షన్లో శుక్రవారం మార్కెట్లోకి విడుదల చేసింది. డెల్టా, జీటా అనే రెండు వేరియంట్లలో గ్రాండ్ విటారా.. కస్టమర్లకు అందుబాటులోకి వస్తున్నది. డెల్టా వర్షన్ రూ.12.85 లక్షలు, జీటా వర్షన్ కారు రూ.18.84 లక్షలకు కొనుగోలు చేయొచ్చు.5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో వస్తున్న ఎస్-సీఎన్జీ గ్రాండ్ విటారా కిలో సీఎన్జీ గ్యాస్ తో 26.6 కి.మీ మైలేజీ ఇస్తుంది.
గ్రాండ్ విటారా పెట్రోల్ వేరియంట్ డెల్టా కారు రూ.10.45 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య లభిస్తుంది. సీఎన్జీ వర్షన్ గ్రాండ్ విటారా మోడల్ కారుకు ఖాతాదారుల నుంచి ఆదరణ పెరుగుతుందని మారుతి సుజుకి ఆశాభావం వ్యక్తం చేసింది. పర్యావరణ హిత వాహనాలకు ప్రాధాన్యం పెంచడానికే గ్రాండ్ విటారా కారును ఎస్-సీఎన్జీ వేరియంట్ తీసుకొచ్చామని వెల్లడించింది. తాజా గ్రాండ్ విటారా మోడల్ కారుతో కలిపి మారుతి సుజుకి 14 మోడల్ కార్లను సీఎన్జీ వర్షన్ లో కస్టమర్లకు అందుబాటులోకి తెస్తున్నది.
గ్రాండ్ విటారా ఎస్-సీఎన్జీ వర్షన్ కారులో 1.5 లీటర్ల డ్యుయల్-జెట్ డ్యుయల్ వీవీటీ కే సిరీస్ ఇంజిన్ అమర్చారు. 5500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 64.6 కిలోవాట్ల విద్యుత్, 4200 ఆర్పీఎం వద్ద 121.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. స్మార్ట్ ప్లే ప్రో+ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు ప్రయాణికుల సేఫ్టీ కోసం సుజుకి కనెక్ట్ సహా ఆరు ఎయిర్ బ్యాగ్ ఫీచర్లు జత కలిశాయి. ప్రయాణికుల సేఫ్టీ కోసం 6-ఎయిర్‌బ్యాగ్‌లు కల ప్రీమియం ఎస్యూవీ సీఎన్జీ వేరియంట్ గ్రాండ్ విటారా అని మారుతి సుజుకి తెలిపింది.
2022 సెప్టెంబర్‌లో దేశీయ మార్కెట్లో ఆవిష్కరించినప్పటి నుంచి గ్రాండ్ విటారాకు భారతీయ కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. కస్టమర్లు గ్రాండ్ విటారా ఎస్-సీఎన్జీ కారును నెలవారీగా రూ.30,723 సబ్స్క్రిప్షన్ ఫీజుతోనూ సొంతం చేసుకోవచ్చు. ఈ సబ్‌స్క్రిప్షన్‌లో కారు ధర, మెయింటెనెన్స్, నెలవారీ ఫీజు, రోడ్ అసిస్టెన్స్‌తోపాటు రిజిస్ట్రేషన్ ఖర్చు కూడా కలిసి ఉంటాయి.ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నవారు కారు సొంతం చేసుకోకుండానే వాడుకోవచ్చు.