Passenger Vehicles | న్యూఢిల్లీ, జూన్ 1: గత కొన్ని నెలలుగా టాప్‌గేర్‌లో దూసుకుపోయిన ప్యాసింజర్ వాహన విక్రయాలు స్వల్ప వృద్ధికి పరిమితమయ్యాయి. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండటంతోపాటు హై బేస్ ఆధారంగా అమ్మకాలు సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. మొత్తంమీద గత నెలలో 3,50,257 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3,35,436తో పోలిస్తే కేవలం నాలుగు శాతం మాత్రమే పెరిగాయి. వీటిలో కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ 1,44,002 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఎంట్రీ లెవల్, కాంప్యాక్ట్ సెగ్మెంట్ కార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టగా..యుటిలిటీ వాహనాలు మాత్రం పెరిగాయి. ఈ ఏడాది వాహన అమ్మకాలు పుంజుకునే అవకాశాలు కనిపించడం లేదు..అధిక బేస్ ఎఫెక్ట్, ఎన్నికలు, ఉష్ణోగ్రతలు పెరగడంతో గత నెలలో తగ్గుముఖం పట్టాయని మారుతీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ పార్థో బెనర్జీ తెలిపారు.
మారుతి కార్ల ధరలు తగ్గింపు
మారుతి సుజుకీ ఎంపిక చేసిన మాడళ్ల ధరలను తగ్గించింది. ఆటోగేర్ షిప్ట్‌తో తయారైన ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలేరియో, వ్యాగన్-ఆర్, సిఫ్ట్, డిజైర్, బాలెనో, ఫ్రాంక్స్, ఇగ్నిస్ మాడళ్ల ధరలను రూ.5 వేల వరకు తగ్గించింది. ఈ ధరలు శనివారం నుంచి అమలులోకి వచ్చాయి.