న్యూఢిల్లీ: జేడీయూ నేత, బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై (Nitish Kumar) కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తారిఖ్ అన్వర్ (Tariq Anwar ) విరుచుకుపడ్డారు. నితీశ్ ఒకరితో పెండ్లి చేసుకుని.. సంసారంతో మరొకరితో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆయనకు అలవాటుగా మారిందని విమర్శిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకరితో పెండ్లి. మరొకరితో సంసారం. నితీశ్ కుమార్‌కు అది సహజమేనని’ పేర్కొన్నారు.
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ నేతలతో సమావేశం తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లిన నితీశ్.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాష్ట్రంలో తాము మహాకూటమితో పొత్తును తెంచుకోవాలని నిర్ణయించుకున్నామని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఆయన రాజీనామాను గవర్నర్ వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని సూచించారు. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్‌కుమార్ బీజేపీతో కలిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఎంగా మళ్లీ ఆయనే ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ కూడా ముఖ్యమంత్రి పదవి కోసం పట్టుబడుతున్నట్లు మరో ప్రచారం జరుగుతున్నది.