ఇదో వింతైన పెండ్లి ! ఎన్నడూ వినని.. ఎప్పుడూ చూడని పెండ్లి ! కరోనా సమయంలో జరిగిన వినూత్న పెండ్లి ! వధూవరులు ఇద్దరూ ఎక్కడో దేశం కాని దేశంలో పెండ్లి చేసుకుంటే.. పుట్టిన ఊళ్లో నుంచే తల్లిదండ్రులు లైవ్ టెలీకాస్ట్లో ఆ తంతు చూసి ఆశీర్వదించిన పెండ్లి ! కరోనా నిబంధనల నేపథ్యంలో నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిందీ వింత పెండ్లి !!
నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన జ్యోతి ప్రకాశ్ దంపతుల కుమార్తె శ్రావణికి, మహారాష్ట్రలోని కిని గ్రామానికి చెందిన నవీన్ రెడ్డితో రెండేండ్ల క్రితం పెళ్లి నిశ్చయమైంది. వధూవరులు ఇద్దరూ అమెరికాలో జాబ్ చేస్తున్నారు. దీంతో వారు స్వదేశానికి రాగానే ఇద్దరికీ మూడు మూళ్లు వేయించి పెండ్లి తంతు జరిపించాలని ఇరు కుటుంబాలు అనుకున్నాయి. కానీ ఇంతలోనే కరోనా వచ్చి.. వాళ్ల ప్లాన్స్ అన్నింటినీ తలకిందులు చేసింది. కొవిడ్-19 నిబంధనల కారణంగా వధూవరులు ఇండియాకు రావడం కుదరలేదు. పోనీ తల్లిదండ్రులైనా అమెరికాకు వెళ్ధామనుకుంటే అది సాధ్యపడలేదు. వివాహం నిశ్చయమై ఏండ్లు గడుస్తున్నా.. కరోనా కారణంగా పెండ్లి జరగకపోవడంతో రెండు కుటుంబాలు తీవ్రంగా ఆలోచనలో పడ్డారు. మరీ ఆలస్యం చేయకుండా ఇద్దరినీ పెండ్లిపీటలు ఎక్కించడమే మంచిదని భావించారు. ఇందుకోసం ఉన్న దారుల గురించి ఆన్వేషించారు. చివరకు అమెరికాలో ఉన్న కొద్దిమంది బంధువుల సమక్షంలో వివాహ తంతు జరిపించాలని నిర్ణయించారు. అనుకున్నట్టుగానే శనివారం సాయంత్రం అమెరికాలో పెండ్లి జరిపించారు. అయితే బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా తన కుమార్తె వివాహం జరిపించాలని జ్యోతి శ్రీనివాస్ మొదట్నుంచి ఆశపడ్డాడు. అందుకే ఏడు సముద్రాల అవతల పెండ్లి జరిగితేనే.. ఆ తంతును తమ బంధువులకు చూపించాలని అనుకున్నాడు. ఇందుకోసం భైంసా పట్టణంలో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడి.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రొజెక్టర్ సహాయంతో అమెరికాలో జరుగుతున్న పెండ్లిని లైవ్ టెలీకాస్ట్ చేయించాడు. పెండ్లికి వచ్చిన బంధుమిత్రులు, కుటుంబసభ్యులకు గ్రాండ్గా విందు ఇచ్చాడు.