హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు బేనిషాన్ సంస్థ ద్వారా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషి బాగున్నదని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ప్రశంసించారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లను తోటల వద్దనే సెర్ప్ ఆధ్వర్యంలోని బేనిషాన్ సంస్థ ద్వారా సేకరించడం మంచి ఆలోచన అని మెచ్చుకొన్నారు. ఈ విధానాన్ని పరిశీలించేందుకు త్వరలోనే తెలంగాణ రాష్ర్టాన్ని సందర్శిస్తానని చెప్పారు. జీవనోపాధుల కల్పనలో వైవిధ్యంగా వ్యవహరిస్తున్న ఐదు రాష్ట్రాల సెర్ప్ అధికారులతో ఆయన మంగళవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలను మాత్రమే ఆహ్వానించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా గత రెండేండ్లలో సాధించిన విజయాలను కేంద్ర మంత్రికి వివరించారు.
బేనిషాన్ ద్వారా ప్రస్తుతానికి ఎనిమిది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌పీవో)ల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నామని, త్వరలో విస్తరిస్తామని చెప్పారు. రైతులకు కలుగుతున్న ఆర్థిక ప్రయోజనాలపై అధ్యయనం చేస్తామని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ఉత్పత్తులకు రెండ్రోజుల్లోనే డబ్బులు చెల్లిస్తున్నట్టు బేనిషాన్ చైర్పర్సన్ మమత పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులకు రవాణా, కమిషన్, తరుగు లాంటి సమస్యలు తప్పిపోయాయని వివరించారు. భవిష్యత్తులో రైతుల నుంచి మరిన్ని వెరైటీలను సేకరిస్తామని వెల్లడించారు. బేనిషాన్ కార్యక్రమాలపై రూపొందించిన వీడియోను ప్రదర్శించారు.