టొరొంటో: కెనడా తదుపరి ప్రధానిగా 59 ఏళ్ల మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ పార్టీ నేతగా ఆదివారం ఆయన ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వాణిజ్య యుద్ధం, విలీన బెదిరింపులతోపాటు పార్లమెంట్ ఎన్నికలు వంటి పెను సవాళ్లను కెనడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో కెనడా నూతన ప్రధానిగా జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ట్రూడో రాజీనామా చేసినప్పటికీ తన వారసుడి పదవీ స్వీకారం పూర్తయ్యే వరకు ప్రధాని పదవిలో కొనసాగనున్నారు.
85.9 శాతం ఓట్ల మెజారిటీతో లిబరల్ పార్టీ కార్నీని తమ నాయకుడిగా ఎన్నుకుంది. ఈ సందర్భంగా కార్నీ ప్రసంగిస్తూ తమ దేశాన్ని బలహీనపరచడానికి ట్రంప్ చేస్తున్న కుట్రలను దీటుగా ఎదుర్కొంటామని ప్రకటించారు. కెనడా వస్తువులపై అన్యాయమైన సుంకాలు విధించిన ట్రంప్ కెనడా ప్రజలను, కార్మికులను, వ్యాపారాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని చెప్పారు.
తాను ప్రధానిగా బాధ్యతలు చేపడితే భారత్తో బలమైన స్నేహ సంబంధాలను నిర్మిస్తానని కెనడా లిబరల్ పార్టీ నేతగా ఎన్నికైన మార్క్ కార్నీ ఇటీవల వెల్లడించారు. భావసారూప్యత గల దేశాలతో తమ వాణిజ్య సంబంధాలను భిన్న రంగాలకు విస్తరించాలన్నదే తన లక్ష్యమని గత మంగళవారం ఆయన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. భారత్తో సంబంధాలను పునర్నిర్మించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు.