సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఏపీ నుంచి నగరానికి గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.4.01లక్షల విలువ చేసే 14కిలోల గంజాయి, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్ ఎస్ఓటీ డీసీపీ మురళీధర్ కథనం ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన చెల్లూరి నాగ వెంకట కృష్ణవేణి అలియాస్ దేవి, అదే ప్రాంతానికి చెందిన అడ్డూరి ప్రసాద్, కిమిడి ప్రశాంత్‌లు స్థానికంగా గంజాయిని కిలో రూ.5000చొప్పున కొనుగోలు చేసి నగరానికి తరలించి ఇక్కడ రూ.కిలో 12000చొప్పున విక్రయిస్తున్నారు. వీరికి విశాఖపట్నం ప్రాంతానికి చెందిన ముతెం ప్రసాద్ గంజాయి సరఫరా చేస్తాడు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రకు చెందిన త్రిభువన్ గోపాల్ అనే వ్యక్తి సూచన మేరకు ఈనెల 24న కృష్ణవేణి, అడ్డూరి ప్రసాద్, ప్రశాంత్‌లు కలిసి ముతెం ప్రసాద్ వద్ద 14కిలోల గంజాయి కొనుగోలు చేసి, నగరానికి తీసుకురావడానికి నర్సీపట్నంలో బస్సు ఎక్కారు. ఎవరికీ అనుమానం రాకుండా గంజాయిని లగేజ్ బ్యాగ్‌లో పెట్టారు. అయితే మధ్యలో పోలీసుల తనిఖీలు ఉంటాయేమో అనే భయంతో చౌటుప్పల్ వద్దకు రాగానే బస్సుదిగి గోపాల్ సూచన కోసం నిరీక్షిస్తున్నారు. అప్పటికే సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4.01 లక్షల విలువ చేసే 14కిలోల గంజాయి, 3సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును చౌటుప్పల్ పోలీసులకు అప్పగించారు.