బిడ్డకు తల్లిపాలను మించిన పౌష్టికాహారం లేదన్న సంగతి తెలిసిందే. అయితే, మారుతున్న జీవనశైలితో చాలామంది చిన్నవయసులోనే ‘డయాబెటిక్’ బారిన పడుతున్నారు. ఇలాంటి షుగర్ బాధితులు.. పిల్లలకు పాలు పట్టొచ్చా? అని చాలామంది అనుమాన పడుతుంటారు. ఈ విషయంలో.. వైద్య నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
టైప్-1, టైప్-2, ప్రెగ్సెన్సీ డయాబెటిక్ బాధితులు పిల్లలకు పాలు ఇవ్వొచ్చని ‘అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్’ స్పష్టం చేస్తున్నది. దీనివల్ల బిడ్డతోపాటు తల్లికీ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నది. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల… డయాబెటిక్ తల్లుల శరీరంలో ఉత్పత్తయ్యే ఇన్సులిన్ బాగా పనిచేస్తుందట. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు కూడా నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు. ఇక ప్రెగ్నెన్సీ డయాబెటిక్ (గర్భధారణ సమయంలోనే వచ్చే మధుమేహం) ఉన్న మహిళలు.. బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల తరువాతి దశలో టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశం 15-30% తగ్గుతుందని అంటున్నారు.
టైప్-1 డయాబెటిస్ ఉన్న మహిళలు పాలు పట్టడం వల్ల.. ఇన్సులిన్ అవసరాలు 25-50% తగ్గుతాయట. ఎందుకంటే, వారిలో పాల ఉత్పత్తి కోసం రక్తంలోని గ్లూకోజ్ అవసరం పడుతుంది. అదేవిధంగా, టైప్-2 డయాబెటిస్ ఉన్న తల్లుల్లోనూ బ్రెస్ట్ ఫీడింగ్ ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయులు నియంత్రణలో ఉంటాయని అంటున్నారు. అదే సమయంలో.. డయాబెటిస్ నియంత్రణ కోసం జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఎందుకంటే.. ప్రసవానంతరం చాలామందిలో ఒత్తిడి అధికం అవుతుంది. పాలు ఇస్తున్నప్పుడు రోజువారీ కేలరీల అవసరం పెరుగుతుంది. కాబట్టి, అందుకు తగ్గట్టుగా, తల్లిగా కొత్త జీవితానికి సరిపోయేలా ఆరోగ్యకరమైన అలవాట్లను ప్లాన్ చేసుకోవాలని చెబుతున్నారు.