న్యూఢిల్లీ: టేబుల్ టెన్నిస్ అంతర్జాతీయ ర్యాంకులను భారత స్టార్ ప్యాడ్లర్లు మనికా బాత్రా, సాతియాన్ మెరుగుపర్చుకున్నారు. మహిళల సింగిల్స్‌లో మనిక ఏకంగా పది స్థానాలు ఎగబాకి 38వ ర్యాంకులో స్థిరపడగా.. పురుషుల్లో సాతియాన్ 34వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. పాయింట్ల విధానంలో మార్పులు చేసిన తర్వాత ఐటీటీఎఫ్ మంగళవారం ర్యాంకులు ప్రకటించింది.
ఇటీవల జాతీయ స్థాయి టోర్నీలో పదో టైటిల్‌ను పట్టేసిన శరత్ కమల్ 37వ స్థానంలో.. తెలంగాణ అమ్మాయి ఆకుల శ్రీజ ఏకంగా 39 స్థానాలు మెరుగుపర్చుకుని 68వ ర్యాంకుకు చేరింది. అర్చనా కామత్ 92, రీత్ టెన్నిసన్ 97 ర్యాంకులు పొందారు. మహిళ డబుల్స్‌లో మనిక-అర్చన జోడీ నాలుగో ర్యాంకుకు చేరుకోగా.. మరో ద్వయం సుతీర్థ ముఖర్జీ-ఐహిక ముఖర్జీ 29వ స్థానంలో నిలిచింది. సాతియాన్-హర్మీత్ దేశాయ్ జంట 28, సాతియాన్-శరత్ జోడీ 29, మిక్స్డ్ డబుల్స్‌లో మనిక-సాతియాన్, అర్చన-మానవ్ ఠక్కర్ జోడీలు 6, 22 స్థానాలు పొందాయి.