
నందికొండ, డిసెంబర్ 26: నల్లగొండ జిల్లా నందికొండలో నిర్మాణమవుతున్న బుద్ధవనం తెలంగాణకే మణిహారంగా నిలుస్తుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నందికొండలోని బుద్ధవనాన్ని వివిధ పత్రికల ఎడిటర్లతో కలిసి సందర్శించారు. బుద్ధుడి పాదాలకు పుష్పాంజలి ఘటించి, మహాస్తూపంపై ఏర్పాటు చేసిన శిల్పాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో చారిత్రక, వారసత్వ ప్రదేశాల అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే బౌద్ధుల ఆనవాళ్లు ఉన్న ఫణిగిరి, ధూళికట్ట, బుద్ధవనం వంటి చారిత్రక ప్రాంతాలను అభివృద్ధి చేశామని తెలిపారు. బుద్ధవనం పనులపై నివేదికను సీఎంకు అందించి తుది మెరుగులు చేపడుతామని చెప్పారు.
కేంద్ర ఆర్కియాలజీశాఖ పరిధిలో ఉన్న రాష్ట్రంలోని చారిత్రక ప్రాం తాల్లో తవ్వకాలు జరిపేందుకు కేంద్రం సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నోముల భగత్, పర్యాటక సంస్థ ఎండీ మనోహర్, బుద్ధవనం ఓఎస్డీ మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టైమ్స్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ ఎడిటర్ కే మహేశ్, డెక్కన్ క్రానికల్ మెట్రో ఎడిటర్ పులిపాక బాలు, వెలుగు ఎడిటర్ చంద్రమౌళి, బుద్ధవనం ఎస్ఈ క్రాంతిబాబు తదితరులు పాల్గొన్నారు.