హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): బడుల బాగు కోసం ప్రభుత్వం ప్రకటించిన ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం, వచ్చే విద్యాసంవత్సరం ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం తదితర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయాలను పలు సంఘాలు స్వాగతించాయి. ఈ నిర్ణయాలతో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఊరట లభిస్తుందని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్ పేర్కొన్నారు.
ఫీజుల నియంత్రణ, ఆంగ్లమాధ్యమ నిర్ణయాలు భేష్ అని తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ (టీపీఏ) అధ్యక్షప్రధాన కార్యదర్శులు నాగటి నారాయణ, సల్లారపు పద్మారెడ్డి అన్నారు. ఫీజుల నియంత్రణకు చట్టం చేయడం హర్షణీయమని హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్ఎస్పీఏ) ప్రతినిధి వెంకట్ పేర్కొన్నారు. సర్కారు స్కూళ్లను బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌కు టీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు మణిపాల్‌రెడ్డి, నాయకుడు నర్సింహాస్వామి ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్‌కు బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ కృతజ్ఞతలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర క్యాబినెట్, సీఎం కేసీఆర్ నిర్ణయించడంపై బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.