దమ్మపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎంతోమంది పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పింది. వారి బంగారు భవిష్యత్‌కు బాటలు వేసింది. 1951లో పూరి గుడిసెలో తరగతి గదికి పునాది పడింది. సమాజానికి ఉత్తమ విద్యార్థు లను అందించాలన్న తపనతో ఏర్పాటు చేసిన ఆ పాఠశాల ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కొంది. వాటన్నింటినీ అధిగమిస్తూ విద్యార్థులకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ చదివిన వారెందరో ఉన్నతస్థానాల్లో కొలువుదీరారు. ప్రస్తుతం పాఠశాల భవన సముదాయంలో 20 తరగతి గదులున్నాయి. 6 నుంచి 10 తరగతుల్లో మొత్తం 482 మంది విద్యనభ్యసిస్తున్నారు. హెచ్‌ఎంతోపాటు 13 మంది ఉపాధ్యాయులున్నారు. మరో 9 మంది ఉపాధ్యాయులు రానున్నారు. ఈ పాఠశాలలో 2005లో ఆంగ్ల విద్యకు బీజం పడింది. ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ పాఠశాల.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు – మన బడి’కి ఎంపికైన నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
దమ్మపేట, ఫిబ్రవరి 22 : నాడు ‘చిన్న గుడిసె’లో మొదలైన ఆ పాఠశాల నేడు ‘ప్రగతి బడి’గా మారింది. దాతలు, గ్రామస్తుల విరాళాలు, పెద్దల సహకారంతో ఉత్తమంగా ఎదిగింది. ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పాఠశాలలో చదివిన ఎందరో విద్యార్థులు ఇప్పుడు ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారు. 71 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పాఠశాలే.. దమ్మపేట ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల.
దమ్మపేటలో 1935లో అప్పటి గ్రామస్తులు, దాతలు నూర్ జమ, నల్లగట్ల లక్ష్మణాచారి (పూజారి), మార్తి రామూర్తి (పోస్టాఫీస్, స్కూల్) వలరాజు చక్రవర్తుల యోగానందాచార్యులు, అద్దంకి గంగరాజు, కౌతా జగన్నాథం, దారా వెంకటరామయ్య, కందుకూరి బుచ్చయ్యచారి, శెట్టిపల్లి వెంగళరావు సహజ వృత్తుల్లో ఉండేవారు. గ్రామంలో పిల్లలకు విద్యాబద్ధులు నేర్పితే బాగుంటదనే ఆలోచన చేసి 1951లో ఓ చిన్న గుడిసెలో తరగతి గదికి పునాది వేశారు. పాఠశాల ఆవిర్భవించిన తర్వాత స్థానికుడు ఆర్.రాఘవయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా నియమితు లయ్యారు. ఆ గుడిసెలోనే 1 నుంచి 5 తరగతులు విద్యార్థులకు క్లాసులు బోధిస్తూ వచ్చారు. కొంతకాలానికి ఆ గుడిసె శిథిలావస్థకు చేరి కూలిపోయింది. దీంతో మనస్తాపం చెందిన రాఘవయ్య నిరాహారదీక్షకు పూనుకున్న తర్వాత అశ్వారావుపేటకు చెందిన కందిమళ్ల వెంకటరామ మహిపాల్, నాటి అటవీశాఖ మంత్రి కొండా వెంకటరెడ్డి, అటవీ శాఖ అధికారి రామచంద్రమూర్తి చొరవతో దమ్మపేటకు చెందిన లక్ష్మారావు 1953లో పాఠశాల కోసం స్థలాన్ని దానం చేశారు. గ్రామస్తులు, దాతల సహకారంతో అది స్థిరమైన పాఠశాలగా రూపుదిద్దుకుంది. 1954లో 1 నుంచి 5 తరగతులు ఉన్న ఈ పాఠశాల 6వ తరగతికి మారింది. 1969 నుంచి 1981 మధ్య ప్రాథమిక, ప్రాథమికోన్నత తరగతులను విభజించారు. 2008 నుంచి ఇప్పటివరకు పాఠశాల పక్కా భవనంతోపాటు భౌతిక వనరులైన బల్లలు, బెంచీలు, కుర్చీలు, అల్మారాలు సమకూరాయి. గ్రామస్తులు, దాతల సహకారంతో ఉన్నతస్థాయికి చేరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా మారింది.
ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన ఈ పాఠశాల.. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘మన ఊరు – మన బడి’కి ఎంపికైంది. పాఠశాల భవన సముదాయంలో 20 తరగతి గదులున్నాయి. 6 నుంచి 10 తరగతుల్లో మొత్తం 482 మంది విద్యనభ్యసిస్తున్నారు. హెచ్‌ఎంతోపాటు 13 మంది ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. మరో 9 మంది ఉపాధ్యాయులు రానున్నారు. ఈ పాఠశాలలో 2005లో ఆంగ్ల విద్యకు బీజం పడింది.
దమ్మపేట పాఠశాలలో 1970 నుంచి 1976 వరకు ప్రాథమిక విద్యను పూర్తిచేశాను. నాడు నేర్చుకున్న విద్యతోనే ఉన్నత స్థాయికి వెళ్లి బ్యాంకింగ్ రంగంలో స్థిరపడ్డా. విద్య నేర్పిన పాఠశాలకు ఏదైనా చేయాలనే సంకల్పంతో నావంతుగా రూ.30 వేలతో పాఠశాల తలుపులు, కిటీకీలకు మరమ్మతులు చేయించా. విద్యార్థులకు బల్లలను సమకూర్చా. నా పాఠశాలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. ‘నా ఊరు – నా పాఠశాల అనే స్ఫూర్తితో సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటా.
-కంభంపాటి ముక్తేశ్వరరావు, ఏపీజీవీబీ రిటైర్డ్ ఏజీఎం, పూర్వ విద్యార్థి
1967 నుంచి 1974 వరకు ప్రాథమిక విద్య మొత్తం దమ్మపేట పాఠశాలలోనే చదివాను. నాటి ఉపాధ్యాయుల స్ఫూర్తితో 1985లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు ఎంపికయ్యాను. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్‌గా ఉద్యోగం పొందాను. ఇంతటి హోదా రావడానికి ప్రధాన కారణం నేను చిన్ననాడు విద్యాబుద్ధులు నేర్చుకున్న దమ్మపేట పాఠశాలే. ఆ పాఠశాల బాలుర కోసం రూ.50 వేలతో మూత్రశాలలను ఏర్పాటు చేశాను. నేను చదువుకున్న పాఠశాలకు నావంతుగా సేవ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నా.
-పసుమర్తి మల్లికార్జునరావు, రిటైర్డ్ ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్, పూర్వ విద్యార్థి
దమ్మపేట పాఠశాలలో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఉన్నత చదువులకు వెళ్లలేకపోయినా ప్రజలకు సేవచేయాలనే తలంపుతో ఉండేవాణ్ని. సొంత ఊరిలోనే ఉంటూ వార్డు సభ్యుడి స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీపీగా పనిచేస్తూ ప్రజలకు సేవ చేశాను. శివాలయం చైర్మన్‌గా 25 ఏళ్లు పనిచేశా. నేను చదివిన పాఠశాల అభివృద్ధికీ నావంతు సహకారం అందించా. అందిస్తా.
-పానుగంటి సత్యనారాయణ, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ, పూర్వ విద్యార్థి