భీమదేవరపల్లి, అక్టోబర్ 30: మొంథా తుఫాను దాటికి హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి (Bheemadevarapally) మండలం అతలాకుతలమైంది. బుధవారం కురిసిన భారీ వర్షంతో భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లికి చెందిన అప్పని నాగేంద్రం (58) అనే వ్యక్తి మృతిచెందారు. నాగేంద్రం హనుమకొండలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.
బుధవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వచ్చే సమయానికి వాన మరింత ఎక్కువైంది. దీంతో గ్రామంలోకి వెళ్లే కల్వర్టు పూర్తిగా జలమయమైంది. ఎలాగైనా దాటి వెళ్లాలనుకున్న అతడు.. దారి కనిపించకపోవడంతో కల్వర్టులో పడి మృతిచెందారు. మృతుడికి గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఒక కన్ను కనిపించదు. మృతునికి భార్య అనిత, ఇద్దరు కుమారులున్నారు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు ముల్కనూర్ ఎస్ఐ రాజు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.