రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : భార్య, ఇద్దరు చిన్నారుల మృతి కేసులో నిందితుడైన వ్యక్తి 14 ఏండ్లకు పోలీసులకు చిక్కాడు. మళ్లీ ఆడపిల్ల పుడుతుందనే అనుమానంతో 2012 జూన్ 29న నిండుగర్భిణి తనతోపాటు ఇద్దరు ఆడపిల్లలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మాహుతికి పాల్పడిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాయిపల్లెలో సంచలనం రేపింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మహేశ్ బీగితే నిందితుడి అరెస్ట్ వివరాలు వెల్లడించారు. మొర్రాయిపల్లికి చెందిన బీ ఆంజనేయులు 2007లో భాగ్యలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు శ్రీనిధి (5), నైపుణ్య (2) ఉన్నారు.
2012లో భాగ్యలక్ష్మి మూడోసారి గర్భవతిగా ఉన్న సమయంలో, మళ్లీ అమ్మా యి పుడుతుందన్న అనుమానంతో భర్త ఆం జనేయులు, అత్తమామలు ఆమెను వేధించారు. దీంతో భాగ్యలక్ష్మి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటనపై 2012లో ఆంజనేయులుపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఆంజనేయులు పరారీలో ఉండటంతో న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది. ఈ క్ర మంలో పోలీసులు నిందితుడిని పట్టుకొని, కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రి మాండ్ విధించింది. పోలీసు బృందానికి భాగ్యలక్ష్మి తల్లి ఎల్లవ్వ కృతజ్ఞతలు తెలిపింది. నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ చూపిన టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేశ్, ముస్తాబాద్ ఎస్ఐ గణేశ్,సిబ్బందిని ఎస్పీ అభినందించారు.