e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News ఈసీ ఆంక్షలు చట్ట విరుద్ధం

ఈసీ ఆంక్షలు చట్ట విరుద్ధం

  • దళితబంధు ఆపివేత పూర్తిగా అసంబద్ధం
  • సుప్రీం ఆదేశాలకు వ్యతిరేకం
  • పథకం కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయండి
  • హైకోర్టులో మల్లేపల్లి పిటిషన్‌

హైదరాబాద్‌, అక్టోబర్‌ 21 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకాన్ని కొనసాగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. దళితబంధు పథకాన్ని బంద్‌ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని చట్ట వ్యతిరేకంగా, ఈసీ నిబంధనల ఉల్లంఘనగా, తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు తీర్పును కాలరాయడంగా ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త, సీనియర్‌ జర్నలిస్ట్‌ మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడికి ముందే అమల్లో ఉన్న పథకాన్ని అడ్డుకునే అధికారం ఈసీకి లేదని ప్రకటించాలని, ఈసీ నిర్ణయం అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కమిషనర్‌, రాష్ట్రంలోని ఎన్నికల ప్రధానాధికారి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, షెడ్యూల్డ్‌ కులాల సహకార అభివృద్ధి సంస్థ ఎండీలను పిల్‌లో ప్రతివాదులుగా చేశారు. పిల్‌లో అంశాలు ఇలా ఉన్నాయి.

అమల్లో ఉన్న పథకాన్ని ఆపుతారా?
హుజూరాబాద్‌ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు పోలింగ్‌ జరిగే ఈ నెల 18 వరకూ దళితబంధు పథకం అమలును నిలిపివేస్తూ సీఈసీ తీసుకున్న నిర్ణయం సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని ప్రకటించాలి. దళితబంధుపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 8న లేఖ రాయడం ఏకపక్షమే కాకుండా అన్యాయం. అన్ని కోణాల్లో లోతుగా అధ్యయనం చేసిన తర్వాతే దళిత సాధికారత కోసం దళితబంధు పథకాన్ని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తున్నది. 202122 బడ్జెట్‌లో వెయ్యి కోట్లను గత మార్చి 18న మంజూరు చేసింది. జూన్‌ 27న సీఎం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి, అన్ని పార్టీ అభిప్రాయాలను స్వీకరించారు. ఆ తర్వాత చాలా కాలానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికను ఈసీ ప్రకటించింది. కోడ్‌ విధించకముందే తెచ్చిన దళితబంధు పథకాన్ని అమలు చేయడం ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు రానేరాదు. అయినా, ఏకపక్షంగా, అన్యాయంగా కోడ్‌ పేరుతో పథకం అమలును నిలిపివేశారు.

- Advertisement -

కొందరు స్వార్థపరుల కారణంగానే..
ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి జూన్‌ 12న రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఫలితంగా హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసీ గత నెల 28న షెడ్యూలు ప్రకటించింది. అయితే కొందరు స్వార్థపరులు కుట్రపూరితంగా పథకం నిలుపుదలకు ప్రయత్నించారు. అకారణంగా దళితబంధు పథకం అమలుకు బ్రేక్‌ వేయాలనే ప్రయత్నాలకు ఈసీ ఆమోదం తెలుపటం చట్ట వ్యతిరేకం. ఈసీ, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వాస్తవాల్లోకి వెళ్లకుండా ఏకపక్షంగా వ్యవహరించారు. అమల్లో ఉన్న పథకానికి హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు ఎలాంటి సంబంధం లేదు. అట్టడుగు దళిత వర్గాల పురోగతి బాధ్యత ప్రభుత్వాలదేనని రాజ్యాంగం నిర్దేశించింది. అందుకు అనుగుణంగా అమలు చేసి, దేశంలో ఎనలేని కీర్తి తెచ్చి, స్ఫూర్తిదాయకంగా నిలిచే దళితబంధును బంద్‌ చేయడం రాజ్యాంగ వ్యతిరేకం. పథకాన్ని ప్రకటించినప్పుడు లేదా అమలు చేసినప్పుడు ఎన్నికల కోడ్‌ లేదంటే అమల్లో ఉన్న పథకాన్ని ఈసీ ఎలా నిలిపివేస్తుంది? తన పరిధిలో లేని అంశంలోకి వెళ్లి నిర్ణయం తీసుకుని ఈసీ చట్ట వ్యతిరేకంగా వ్యవహరించింది.

2019లో ఈసీ చెప్పిన దానికి భిన్నంగా..
కేంద్రం దేశవ్యాప్తంగా ‘పోషణ్‌’ పేరిట పథకాన్ని అమలు చేసినప్పుడు సీఈసీ 2019 జనవరి 24న కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖకు రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే దళితబంధు అమలు నిలిపివేత ఏకపక్షమని తేలుతుంది. ‘మోడల్‌ కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు పథకాన్ని ప్రారంభిస్తే.. అధికారులు మాత్రమే చేయాలి. రాజకీయ పార్టీలతో సంబంధం ఉండకూడదు. ఓటర్లను ప్రభావితం చేసేలా పథకం ఉన్నదనే ముద్ర ఉండకూడదు. ఆర్భాటాలు చేయకూడదు’ అని ఈసీ అప్పుడు చెప్పింది. హుజూరాబాద్‌లో దళితబంధు పథకాన్ని నిలిపివేయడం.. గతంలో ఈసీ కేంద్రానికి లేఖ ద్వారా తెలిపిన వివరణకు విరుద్ధంగా ఉన్నదని హైకోర్టు ప్రకటించాలి. కోడ్‌ అమలుకు ముందున్న చట్టాల విషయంలో జోక్యం చేసుకునే అధికార పరిధి ఈసీకి లేదని సుప్రీంకోర్టు సైతం చెప్పింది. చట్టసభ తీసుకున్న నిర్ణయాల అమలు విషయంలో జోక్యం చేసుకునే అధికారం ఈసీకి లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు.. ఎస్‌ సుబ్రమణియన్‌ బాలాజీ వర్సెస్‌ తమిళనాడు కేసులో తీర్పు చెప్పింది. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈసీ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి. ఎన్నికల షెడ్యూల్‌ వెల్లడికి ముందు కేంద్రం దేశవ్యాప్తంగా ప్రారంభించిన సుప్ర పథకంపై అభ్యంతరం చెప్పని ఈసీ.. దళితబంధు పథకాన్ని మాత్రమే అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. అంతేకాకుండా షెడ్యూల్డ్‌ కులాల విషయంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఈసీ నిర్ణయం ఉన్నది. ఈసీ నిర్ణయం ఏకపక్షం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ అధికరణాల ఉల్లంఘన.

సుప్రీంకోర్టు తీర్పుకు భిన్నంగా ఈసీ చర్య
ఎన్నికల కోడ్‌ ఉండగా కొత్త పథకాలను అమలు చేయడానికి వీల్లేదు. అమల్లో ఉన్న పథకాలను నిలిపివేసే అధికారం ఈసీకి లేదు. ఎన్నికల కోడ్‌ నిబంధనలను హైకోర్టు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. ఈ వ్యవహారంపై కోర్టులు తీర్పులు కూడా ఇచ్చాయి. వీటన్నింటినీ పరిశీలించి, దళితబంధు పథకం అమలును నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమని ప్రకటించాలి. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలి. ఈసీ నిర్ణయం రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకమని ప్రకటించాలి. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు అమలు కొనసాగేలా ఈసీ నిర్ణయాన్ని సస్పెండ్‌ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి.

బీజేపీది కుత్సిత బుద్ధి
ఏ రాజకీయ పార్టీ అయినా తమ విధానాల ద్వారా, తాము చేసిన మంచి పనులు, చేయబోయే పనులు చెప్పి ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తాయి. బీజేపీ మాత్రం హుజూరాబాద్‌లో దళితుల హక్కును కాలరాచే విధంగా వ్యవహరిస్తున్నది. ఉప ఎన్నికలో లబ్ధిపొందేందుకు బీజేపీ తన దళిత వ్యతిరేకతను చాటుకున్నది. దళితబంధు పథకంపై బీజేపీ వితండవాదం చేస్తున్నది. రైతుబంధు, ఆసరా పింఛన్లు, మిషన్‌ భగీరథ మాదిరిగా దళితబంధు కూడా ప్రభుత్వ పథకం. ప్రభుత్వ పథకాలను ఎన్నికల కోణంలో ఆపాలని కోరటం బీజేపీ కుత్సిత బుద్ధికి నిదర్శనం.

  • మల్లేపల్లి లక్ష్మయ్య, సీనియర్‌ జర్నలిస్టు
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement