Lions | న్యూఢిల్లీ: ఆడతోడు కోసం అలమటించి పోయిన రెండు సోదర సింహాలు ఓ నదిని 1.3 కిలోమీటర్లు ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి. ఉగాండాలోని క్వీన్ ఎలిజబెత్ నేషనల్ పార్క్లో జరిగిందీ ఘటన. ఆ నది మొత్తం మొసళ్లు, నీటి ఏనుగులతో నిండి ప్రమాదకరంగా ఉన్నప్పటికీ లెక్కచేయకుండా ఈదాయి. రెండు సింహాలలో ఒకటైన జాకబ్ క్వీన్ ఎలిజబెత్ పార్కులో పదేండ్లుగా నివసిస్తున్నది.
ఇది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని కాలు కోల్పోయింది. అయినప్పటికీ సోదర సింహంతో కలిసి రెండు సరస్సులను కలిపే జలమార్గాన్ని విజయవంతంగా దాటింది. పార్కులో ఆడసింహాల కోసం విపరీతమైన పోటీ ఉంది. ఈక్రమంలో ఓ ఆడతోడు కోసం మరో మగ సింహాల గుంపుతో పోరాడి ఓడిపోయాయి. ఆ తర్వాత ఇవి రెండూ నదికి ఆవలివైపున ఉన్న ఆడ సింహాల కోసం ప్రమాదకరమైన ప్రయాణం చేసి ఉండొచ్చని ఆస్ట్రేలియాకు చెందిన అధ్యయనకర్త అలెక్స్ బ్రాజ్కోవ్స్కీ తెలిపారు.