Director | ఈ మధ్య సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వయోభారంతో కొందరు, అనారోగ్యంతో మరికొందరు తనువు చాలిస్తున్నారు. తాజాగా పద్మశ్రీ అవార్డ్ గ్రహీత,ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్(73) కన్నుమూశారు. మలయాళ సినిమాకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన ఈ దర్శకుడు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తిరువనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. క్యాన్సర్ బారీన పడిన ఆయన కొన్నేళ్లుగా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించి కన్నుమూసినట్టు తెలుస్తుంది.
పిరవి అనే సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. మొదటి సినిమాతోనే అందరి నుంచి ప్రశంసంలు అందుకున్న ఆయన ఈ సినిమాతోనే ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును కూడా దక్కించుకున్నారు. షాజీ మలయాళ సినిమాకి చేసిన సేవలకు భారత ప్రభుత్వం 2011లో పద్మశ్రీతో సత్కరించింది. అలానే కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను జెసి డేనియల్ అవార్డుతో సత్కరించింది. షాజీ ఎన్ కరుణ్ 1952లో జన్మించారు. ఆయన పల్లిక్కరలో స్కూల్, తిరువనంతపురం యూనివర్సిటీ కాలేజీలో విద్యనభ్యసించారు.
పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరి 1975లో సినిమాటోగ్రఫీలో డిప్లొమా పొందిన ఆయన అనంతరం రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థలో ఫిల్మ్ ఆఫీసర్‌గా చేరారు. ఈ సమయంలోషాజీ ప్రఖ్యాత దర్శకుడు జి అరవిందన్‌తో కలిసి పనిచేశారు. తదనంతరం కెజి జార్జ్, ఎంటి వాసుదేవన్ నాయర్ వంటి ప్రముఖుల చిత్రాలకు కెమెరా మెన్‌గా పనిచేశారు. షాజీ ఎన్ కరుణ్ మొదటి చిత్రం పిరవి డెబ్బై చలన చిత్రోత్సవాలలో ప్రదర్శితం అయింది. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులతో సహా 31 కి పైగా అవార్డులను గెలుచుకుంది. పలువురు స్టార్ హీరోలతో కూడా ఆయన పని చేశారు.