Lifestyle | ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ జీవితంలో చాలా మంది సరైన జీవనశైలిని పాటించడం లేదు. ఉదయం ఆలస్యంగా నిద్ర లేవడంతోపాటు రోజంతా అన్ని పనులను వేళ తప్పించి చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్లను టైముకు చేయడం లేదు. రాత్రి పూట ఆలస్యంగా తినడం, లేటుగా నిద్రించడం చేస్తున్నారు. అలాగే రోజంతా గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారు. శారీరక శ్రమ ఉండడం లేదు. ఇలా అస్తవ్యవస్తమైన జీవనశైలి కారణంగా చాలా మందికి అనేక వ్యాధులు వస్తున్నాయి. టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం, గుండె జబ్బులు, కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కానీ రోజువారి అలవాట్లు లేదా జీవనశైలిలో కొన్ని సులభమైన, స్వల్ప మార్పులు చేసుకుంటే దాంతో ఎలాంటి రోగాలు రాకుండా ముందుగానే నివారించవచ్చు. రోజువారి దినచర్యలో పాటించే కొన్ని అలవాట్లే పెద్ద మార్పులను ఇస్తాయి. అలాంటి అలవాట్ల గురించి వైద్య నిపుణులు వివరిస్తున్నారు.
ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన వైద్యుడు డాక్టర్ సౌరభ్ సేథీ భవిష్యత్తులో వచ్చే అనేక వ్యాధులను నివారించేందుకు కొన్ని సులభమైన రోజువారీ అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయని వెల్లడించారు. చిన్నచిన్న జీవనశైలి మార్పులు గుండె జబ్బులు, మధుమేహం, ఊబకాయం, జీర్ణ సంబంధ సమస్యలు, మానసిక ఒత్తిడి వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తాయని ఆయన వివరించారు. ఉదయం లేవగానే సూర్యకాంతిలో కొంత సమయం గడపడం అత్యంత ఉపయోగకరం. ఇది శరీరంలోని సర్కేడియన్ రిథమ్‌ను సరిచేసి నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. అదనంగా విటమిన్-డి ఉత్పత్తికి సహాయపడటంతోపాటు మానసిక ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు.
రోజుకు కనీసం 30 నిమిషాల నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. దీని వల్ల రక్త ప్రసరణ మెరుగుపడటంతో పాటు గుండె ఆరోగ్యం బలపడుతుందని తెలిపారు. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచి మధుమేహ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. ఆహారపు అలవాట్ల విషయంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక చక్కెర, ఫాస్ట్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. బదులుగా ప్రోటీన్, ఫైబర్, పండ్లు, కూరగాయలు, సహజ ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండటం కండరాల ఆరోగ్యానికి, మెటబాలిజం మెరుగుదలకు సహాయపడుతుందని తెలిపారు. నిద్రపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర పొందడం ఆరోగ్యానికి అత్యంత కీలకమని చెప్పారు. సరైన నిద్ర లేకపోతే హార్మోన్ అసమతుల్యత, బరువు పెరగడం, ఒత్తిడి, గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరించారు.
నీరు తాగడం కూడా ఆరోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా తగినంత నీరు తీసుకోవడం ద్వారా శరీరంలో టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడటంతోపాటు జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం మెరుగుపడతాయని అన్నారు. డీహైడ్రేషన్ వల్ల అలసట, తలనొప్పి, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు వస్తాయని చెప్పారు. డాక్టర్ సేథీ ఒత్తిడి నియంత్రణపై కూడా సూచనలు చేశారు. ధ్యానం, శ్వాసాభ్యాసాలు, కుటుంబ సభ్యులతో సమయం గడపడం వంటి అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలిపారు. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు)ను పెంచి అనేక వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరించారు. స్మోకింగ్, అధిక మద్యం సేవనాన్ని పూర్తిగా నివారించాలని స్పష్టం చేశారు. ఈ రెండు అలవాట్లు గుండె జబ్బులు, క్యాన్సర్, లివర్ సమస్యలు వంటి తీవ్రమైన వ్యాధులకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
ఆరోగ్యం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని ప్రతిరోజూ చేసే చిన్న అలవాట్ల సమాహారమే భవిష్యత్తు వ్యాధులు వచ్చే అవకాశాలను నిర్ణయిస్తుందని డాక్టర్ సౌరభ్ సేథీ పేర్కొన్నారు. మందుల కంటే ముందుగా జీవనశైలిని సరిచేసుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని సూచించారు.