Vijay | తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పుకు నాంది పలుకుతూ దళపతి విజయ్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దశాబ్దాలుగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యే సాగిన రాజకీయ పోరుకు ప్రత్యామ్నాయంగా టీవీకే పార్టీని నిలబెట్టి విజయ్ సాధించిన విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్.. ఇప్పుడు ప్రజానాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తన నియోజకవర్గంలో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా, తన పార్టీ అభ్యర్థులను కూడా భారీ సంఖ్యలో గెలిపించి రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరిచారు.
ముఖ్యంగా యువత, మహిళా ఓటర్లు విజయ్ విజయానికి ప్రధాన బలంగా నిలిచారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా విజయ్‌కు విపరీతమైన మద్దతు కనిపించింది. సినీ ఇమేజ్ను రాజకీయ శక్తిగా మలచుకోవడంలో విజయ్ సక్సెస్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్‌కు భారీ అభిమాన వర్గం ఉంది. సాధారణంగా తమిళ హీరోలకు తెలుగులో మంచి మార్కెట్ ఉండటం సహజమే అయినప్పటికీ, విజయ్ విషయంలో ఆ అభిమానానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి ఆదరణ లభించడమే కాకుండా, వ్యక్తిగతంగా కూడా ఎంతోమంది అభిమానులు ఆయనను ఆదరిస్తున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావాలని తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు చాలా కాలంగా కోరుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అభిమానులు కూడా భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2012లో జరిగిన ‘తుపాకి’ సినిమా కార్యక్రమంలో విజయ్ చేసిన తెలుగు ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కార్యక్రమంలో విజయ్ దాదాపు పూర్తిగా తెలుగులో మాట్లాడి అభిమానులను ఆశ్చర్యపరిచారు. “నాకు తెలుగు చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ నాకు ఎంతో ప్రేమ ఇచ్చారు. అందుకే నేను తెలుగులో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను” అంటూ విజయ్ చెప్పిన మాటలు ఇప్పుడు మరోసారి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
ఆ సమయంలో తెలుగు ప్రేక్షకుల పట్ల తనకున్న అభిమానాన్ని ఎంతో వినయంగా వ్యక్తం చేసిన విజయ్.. ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ఎదగడం అభిమానుల్లో గర్వాన్ని నింపుతోంది. ముఖ్యంగా ఆయన తెలుగు పదాలను స్పష్టంగా పలికిన తీరు అప్పట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది.ఇక ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఆ వీడియో మళ్లీ వెలుగులోకి రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. “దళపతి కేవలం తమిళనాడుకే కాదు.. మొత్తం దక్షిణ భారతానికి గర్వకారణం” అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.