ఇల్లెందు, ఆగస్టు 22 : పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 25 నుండి 30వ తేదీ వరకు చేపట్టే విద్యార్థి పోరుబాట యాత్ర చర్లలో ప్రారంభం అవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం ఇల్లెందు పట్టణ అధ్యక్ష, కార్యదర్శి బి.సాయి, ఏ.పార్థసారథి విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇల్లెందు పట్టణం చండ్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో పీడీఎస్యూ ఇల్లెందు పట్టణ ముఖ్యుల సమావేశం జరిగింది. గంగాధర గణేశ్ అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక విద్యారంగ సమస్యలు రోజురోజుకు మరింత జఠిలమవుతున్నాయే తప్పా పరిష్కారం దిశగా ముఖ్యమంత్రి చొరవ చూపడం లేదన్నారు.
రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా విద్యా శాఖ మంత్రి నియమించక పోవడం, పాఠశాల, కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను, మండలాలు, జిల్లాల్లో ఖాళీగా ఉన్న ఎంఈఓ, డీఓ పోస్టులను భర్తీ చేయకపోవడం, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడంలో జాప్యం చేయడం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వంగా తేలిపోయిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సోయి తెచ్చుకుని విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ ఇల్లెందు పట్టణ నాయకులు శ్రావణి, భాను, విష్ణు, సాయి, అఖిల్, మణి, భార్గవి పాల్గొన్నారు.