
తెలంగాణ రాష్ట్రం వచ్చాక సంగారెడ్డి జిల్లాకు మహర్దశ పట్టిందని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఆయన జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో ఏడు వైకుంఠ రథాలను ప్రారంభించారు. ఆ తర్వాత సంగారెడ్డి మంజీరానగర్‌లో రూ.6.70 కోట్లతో సమీకృత వెజ్-నాన్‌వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. సీఎం కేసీఆర్ పార్టీలను చూడకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. సంగారెడ్డిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేనప్పటికీ, ఇక్కడి ప్రజల అవసరాలను గుర్తించిన సీఎం కేసీఆర్ రూ.550 కోట్లతో మెడికల్, నర్సింగ్ కాలేజీలను మంజూరు చేశారన్నారు. త్వరలో వీటికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ప్రభుత్వ కృషితో సంగారెడ్డి జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, పెట్టుబడుల్లో సింహభాగం జిల్లాకు వస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్, మెడికల్ డివైజ్ పార్కు, నిమ్జ్‌తో జిల్లా వేగంగా అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు.
సంగారెడ్డి, డిసెంబర్ 16 : పార్టీలు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ సర్కారు పని చేస్తున్నదని ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతితో ఊర్లకు కొత్త రూపు వచ్చిందని పేర్కొన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి హాజరైన మంత్రికి సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి స్వాగతం పలికారు. పలువురు కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు పూల బొకే అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. పట్టణాలను సుందరీకరించే సఫాయి కార్మికుల సేవలను గుర్తించి, వేతనాలు పెంచి, సముచిత గౌరవాన్ని ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని, కార్మికులను ఆప్యాయంగా పలకరించి, సమస్యలు తెలుకొని, పరిష్కరించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం మున్సిపాలిటీలకు ప్రతినెలా రూ.66.9కోట్లు విడుదల చేస్తున్నదన్నారు. పట్టణాలు, పల్లెలకు కేటాయించిన బడ్జెట్లో 10శాతం నిధులను పచ్చదనానికి ఖర్చు చేస్తున్నామన్నారు. రవాణాకు ఇబ్బందుల్లేకుండా, వాహనాలు సాఫీగా సాగేలా రూ.15కోట్లతో జిల్లా కేంద్రం ప్రధాన రహదారిపై డివైడర్ నిర్మించామన్నారు. గతంలో సఫాయి కార్మికులకు నాలుగైదు నెలలకోసారి జీతాలు చెల్లించే వారని, ధర్నాలు చేసినా పట్టించుకునే వారే ఉండకపోయేదని గుర్తుచేశారు. పారిశుధ్య కార్మికుల వేతనాలను రూ.12వేలకు పెంచి, గౌరవించి, సగౌరవంగా పలరించిన ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. అది కేవలం సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు త్వరలో జీవో
ప్రభుత్వ స్థలాల్లో పేదలు ఇండ్లు నిర్మించుకోగా, తెలంగాణ సర్కారు హయాంలో ఒకసారి ఆ స్థలాలను క్రమబద్ధీకరించామని, అలాంటి పేదలు ప్రభుత్వ స్థలాల్లో నివాసాలుంటే వాటి క్రమబద్ధీకరణకు మరోసారి జీవో జారీకి సబ్ కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలో క్రమబద్ధీకరణ జీవో జారీ చేసి, పేదల ఆకాంక్షలు నెరవేరుస్తామని మంత్రి ప్రకటించారు. సదాశివపేట పట్టణ అభివృద్ధికి రూ.50కోట్లను వారం, పది రోజుల్లో విడుదల చేస్తామని మంత్రి ప్రకటించారు. పట్టణవాసులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకే ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పట్టణాలు, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని, నిధుల కొరత లేకుండా ప్రతినెలా నిధులు విడుదల చేస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, డీసీసీబీ అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, రాష్ట్ర పురపాలకశాఖ డైరెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ రాజర్షిషా, మున్సిపల్ చైర్పర్సన్లు విజయలక్ష్మి, జయమ్మ, వైస్ చైర్మన్లు లత, చింతా గోపాల్, కౌన్సిలర్లు పద్మ, రామప్ప, శ్రీకాంత్(నానీ), విష్ణువర్దన్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వర్లు, నర్సింహులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిధులు కేటాయించాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి
అంతకు ముందు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి రూ.996కోట్ల నిధులు మంజూరు చేసి, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించాలని మంత్రిని కోరారు. చెరువుల సుందరీకరణకు చర్యలు తీసుకొని, మహబూబ్‌సాగర్ పనులు ప్రారంభించాలన్నారు. సదాశివపేట మండలం సిద్ధాపూర్ శివారు, కొండాపూర్ మండలం ఆలియాబాద్‌లో అర్హులకు కేటాయించిన స్థలాలను క్రమబద్ధీకరించాలని కోరారు. రెండు మున్సిపాలిటీల్లో డ్వాక్రా మహిళా సంఘాల భవనాలకు నిధులు ఇవ్వాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు.
వైకుంఠ రథాలు ప్రారంభం
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 16 : గ్రాన్యుల్స్ సంస్థ సంగారెడ్డి, సదాశివపేట తదితర ప్రాంతాల కోసం అందజేసిన ఏడు వైకుంఠ రథాలను గురువారం సంగారెడ్డిలో మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. సామాజిక బాధ్యత కింద సంస్థ వైకుంఠ రథాలను అందించడం అభినందనీయమని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
సంగారెడ్డికి మెడికల్ కాలేజ్ మంజూరు..
జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ మంజూరు చేశామని మంత్రి కేటీఆర్ అన్నారు. శాసనసభలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రసంగంలో సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని కోరిన విషయం తనకు గుర్తుందన్నారు. కాలేజీ పనులు ప్రారంభించి, త్వరలో అందుబాటులోకి తెచ్చి, విద్యార్థులకు వైద్య విద్య అందిస్తామన్నారు. రాజకీయాలకతీతంగా అబివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టణాలు, పల్లెలు పచ్చదనంతో కళకలలాడుతున్నాయన్నారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయి మున్సిపల్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎదిగిన వారని, అభివృద్ధి విషయంలో వారికి పూర్తి అవగాహన ఉంటుందన్నారు.