Maharashtra : మహారాష్ట్రలో రెసిడెంట్ డాక్టర్స్ చేపట్టిన సమ్మెను గురువారం నుంచి విరమించారు. బాంబే హైకోర్టు ఆదేశాలతో సమ్మె విరమిస్తున్నట్లు ఈ సంఘ సభ్యులు తెలిపారు. సీసీఎంపీ కోర్సును రద్దు చేయాలని కోరుతూ డాక్టర్లు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. హోమియోపతిక్ (బీహెచ్ఎంఎస్) డాక్టర్లు సీసీఎంపీ (సర్టిఫికెట్ కోర్స్ ఇన్ మోడర్న్ ఫార్మకాలజీ) కోర్సు చదివేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. అంటే, హోమియోపతి డాక్టర్లు ఈ కోర్సు పూర్తి చేస్తే ఆధునిక, అల్లోపతి వైద్యంపై పట్టు సాధిస్తారు. వారికి ఈ కోర్సు ద్వారా అల్లోపతి వైద్యానికి సంబంధించిన ప్రాథమిక అంశాల్లో శిక్షణ ఇస్తారు.
దీంతో వీరు కూడా ఇతర అల్లోపతి డాక్టర్లలాగే వైద్యం చేసేందుకు అనుమతి పొందుతారు. వీరికి రిజిస్ట్రేషన్ కూడా లభిస్తుంది. అయితే, దీన్ని అల్లోపతి డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రెసిడెంట్ డాక్టర్స్ నిరసనకు దిగారు. ఎంఏఆర్డీ (మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్) ఆధ్వర్యంలో, రాష్ట్రంలోని 32 ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది ఆగష్టు 5, బుధవారం అర్ధరాత్రి నుంచి నిరంతర సమ్మెకు దిగారు. ఆస్పత్రుల్లో ఓపీ సేవల్ని, ఇతర సేవల్ని నిలిపివేశరు. అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. అయితే, ఈ అంశంపై బాంబే హైకోర్టు గురువారం స్పందించింది. డాక్టర్ల సమ్మెపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె కాలానికి వేతనాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. ఇదే సమయంలో వెంటనే సమ్మె విరమించాలని సూచించింది.
మధ్యాహ్నం భోజన విరామం తర్వాత డాక్టర్లు పూర్తిగా విధుల్లోకి చేరాలని ఆదేశించింది. దీంతో గురువారం మధ్యాహ్నం నుంచి సమ్మె విరమిస్తున్నట్లు ఎంఏఆర్డీ ప్రతినిధులు ప్రకటించారు. వెంటనే విధుల్లోకి చేరుతున్నామన్నారు. ఓపీ సహా అన్ని సేవల్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఏఆర్డీ అధ్యక్షుడు డా.అధర్వ షిండే, ట్రెజరర్ డా.అమోల్ గీతే సహా ఇతర నాయకులు మాట్లాడుతూ.. తాము సమ్మె వెంటనే విరమిస్తున్నప్పటికీ.. సీసీఎంపీకి వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. తమ సభ్యులతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.