ముంబై : పోలింగ్ బూత్‌లకు 200 మీటర్ల పరిధిలో ఓటర్లు, అభ్యర్థులు, పోలింగ్ అధికారులు చెప్పులు ధరించడంపై నిషేధం విధించాలని ఓ అభ్యర్థి డిమాండ్ చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మహారాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పరంద నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుదాస్ శంభాజీ ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. తన ఎన్నికల గుర్తు ‘చెప్పులు’ అని, వీటిని ధరించడం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమవుతుందని తెలిపారు. ఈసీ నియమావళి ప్రకారం, అభ్యర్థులు ఎన్నికల గుర్తులను పోలింగ్ బూత్‌ల వద్ద ప్రదర్శించరాదన్నారు.