నాగర్కర్నూల్ (ఏప్రిల్ 24) నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు 2015నుంచి అమలవుతున్న హరితహారం పథకంలో ఇకపై నిధులలేమి తీరిపోనున్నది. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిశాఖ, అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీల్లో వానాకాలంలో హరితహారంలో భాగంగా మొక్కలను నాటుతున్నది. దీనికోసం పంచాయతీలు, మున్సిపాలిటీ అధికారులు గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేస్తూ మొక్కలను సిద్ధం చేస్తున్నాయి. పెరిగిన మొక్కలను వానాకాలంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా నాటిస్తున్నారు.
ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్ సిబ్బందిచే మొక్కల రక్షణకు ఫెన్సింగ్, ట్రాక్టర్లతో నీళ్లను పోయడం, కలుపు తీయడం పనులు చేపడుతున్నారు. వీటితోపాటు ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, పట్టణంలో అర్బన్ పార్కులను ఏర్పాటు చేశారు. దీంతో గ్రామాల రహదారులు, కూడళ్లు, విద్యాసంస్థలు, కార్యాలయాల్లో పచ్చదనం సంతరించుకుంటున్నది. ఈ పథకం కోసం ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తోంది. అయితే ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు హరితనిధి పేరిట నిధుల సేకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజాప్రతినిధుల నుంచి విద్యార్థుల వరకు హరితహారానికి తమ వంతు ఆర్థికసాయం చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఫిబ్రవరిలో జీవో 17 విడుదల చేసింది. ఈ నెల నుంచి నిర్ధేశించిన రుసుము ఆయావర్గాల నుంచి వసూలు చేసేందుకు పలు శాఖలు నిమగ్నమయ్యాయి.
దీర్ఘకాలంలో హరితహారం పథకం విజయవంతంగా అమలవడమే హరితనిధి ఉద్ధేశం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ల నుంచి సర్పంచుల వరకు, కలెక్టర్ల నుంచి కిందిస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల వరకు, అలాగే వివిధ రకాల వ్యాపారస్తులతోపాటు విద్యార్థుల నుంచి కూడా హరిత నిధికి ఆర్థికసాయం అందనున్నది. దీంతో ప్రజలు, అధికారులు, ఉద్యోగులు, వ్యాపారస్తుల్లో కూడా హరితహారం తమ పథకమనే భావన ఏర్పడుతున్నది. నాటిన మొక్కలను సంరక్షించడంపై హరితనిధి ప్రభావం చూపించనున్నది. ఆయా శాఖల వారీగా అధికారులు హరితనిధికి ప్రభుత్వ ఉద్యోగుల నుంచి నిధులను జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విద్య, వైద్యం, రిజిస్ట్రార్, మున్సిపల్, పంచాయతీ ఇలా అన్నివర్గాల నుంచి హరితనిధికి నిధులు సమకూరనున్నాయి. మొత్తం మీద హరిత నిధి వల్ల హరితహారం పథకానికి నిధుల సమస్య తీరడంతోపాటు ప్రజల భాగస్వామ్యం కానుండటం గమనార్హం.
హరితనిధికి జమ చేస్తున్నాం
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలమేరకు హరితనిధికి నిర్ధేశించిన మేర నిధులు జమచేస్తున్నాం. వ్యాపారస్తులకు ట్రేడ్ లైసెన్సు సమయంలో, రెన్యువల్స్తోపాటు ప్రజాప్రతినిధుల వేతనాల నుంచి హరితనిధికి నిధులు జమవుతాయి. ప్రతి సంవత్సరం ట్రేడ్ లైసెన్సుకు రూ.1000, మున్సిపల్ చైర్మన్లు రూ.600, కౌన్సిలర్లు రూ.120చొప్పున హరితనిధికి చెల్లించనున్నారు.
– అన్వేష్, మున్సిపల్ కమిషనర్, నాగర్కర్నూల్