మహబూబ్‌నగర్, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 80 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని భావిస్తున్న వేళ.. నిరుద్యోగులంతా ఉద్యోగాల సాధనకు సిద్ధమవుతున్నారు. చదువుకునేందుకు ఎక్కడైతే మంచి అవకాశాలుంటాయో ఆ వేదికను వెతుక్కొని ప్రిపరేషన్ వేటలో ఉన్నారు. ఈసారి కచ్చితంగా ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నారు. ఇంటి వద్దో లేక రూంలోనో ఉండి చదువుకుంటే కష్టమనే ఉద్దేశంతో చాలా మంది లైబ్రరీల బాట పట్టారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో పీజీ చదువుతున్న విద్యార్థులు అక్కడే చదువుకుంటూ ఉద్యోగాణ్వేషణకు సిద్ధమవుతున్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీ చిన్న చిట్టడవిని తలపిస్తున్నది. ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. రణగొణ ధ్వనులేమీ వినపించని ఈ క్యాంపస్ ఆహ్లాదకరమైన వాతావరణానికి మారుపేరు. పీజీ విద్యార్థులు క్లాసులు వింటూనే.. ఇక్కడ లభిస్తున్న ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. అలాగే పీయూలోని లైబ్రరీలో విద్యార్థులు చదువుకునేందుకు 24 గంటలపాటు తెరిచే ఉంచుతున్నారు. విద్యార్థులకు నిపుణులతో అవగాహన కల్పిస్తూ ఉద్యోగాలు సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. వసతితోపాటు పోటీ పరీక్షల కోసం ఉచితంగా కోచింగ్ అందిస్తున్నారని నిరుద్యోగులు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80,039 కొత్త పోస్టులను భర్తీ చేయనుండగా..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 4,429 జిల్లా స్థాయి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. జోగుళాంబ జోన్ స్థాయిలో 2,190 ఉద్యోగాలకు నిరుద్యోగులు పోటీ పడనున్నారు. మరోవైపు మల్టీ జోన్ 2 (జోగుళాంబ, యాదాద్రి, చార్మినార్) పరిధిలో 6,370 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా ఉమ్మడి జిల్లా పరిధిలోని నిరుద్యోగులు వారి వారి జిల్లా పోస్టుల కోసం ప్రయత్నం చేస్తూనే.. అటు జోన్ స్థాయి, ఇటు మల్టీ జోన్ 2 స్థాయి ఉద్యోగాలు 8,560 పోస్టులకు పోటీ పడేందుకు అవకాశం ఉన్నది. పాలమూరు విశ్వవిద్యాలయంలో పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు తమ ప్రిపేరేషన్, ఇక్కడ తమకు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు.
సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం..
మా క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులు అనేక మంది పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలనే కసితో కష్టపడుతున్నారు. వివిధ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వీరంతా ఎంతో అంకితభావంతో చదువుకుంటున్నారు. వారికోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఈ లైబ్రరీ స్థాయిని పెంచి విద్యార్థులకు అవసరమైన సమాచారం అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కొత్త బుక్స్ అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులు అడిగిన బుక్స్ వెంటనే తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటు గ్రూప్స్ కోసం ప్రిపేరయ్యే విద్యార్థులకు ప్రత్యేకంగా అత్యుత్తమ ఫ్యాకల్టీతో కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో మంచి పేరున్న ఫ్యాకల్టీతో కోచింగ్ ఇప్పిస్తున్నాం. ఎక్కడా రాజీపడడం లేదు. విద్యార్థులతో రెగ్యులర్‌గా మాట్లాడుతూ వారికి సహకరిస్తున్నాం. నిపుణులతో ఎప్పటికప్పుడు అవగాహన తరగతులు ఇప్పిస్తున్నాం. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్ వస్తే వాటి కోసం ప్రిపేరయ్యే మా క్యాంపస్ విద్యార్థులకు కోచింగ్ ఇప్పించేందుకు రెడీగా ఉన్నాం. ఫిజికల్ శిక్షణ కూడా ఇప్పిస్తాం. క్యాంపస్ విద్యార్థులకు వెన్నుదన్నుగా ఉంటాం.
– లక్ష్మీకాంత్ రాథోడ్, వైస్ చాన్స్‌లర్, పాలమూరు యూనివర్సిటీ, మహబూబ్‌నగర్
డీఎస్సీ కోసం తొలిసారిగా..
ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతుండగా.. మేం ప్రిపరేషన్లో ఉన్నాం. తొలిసారిగా డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నా. ఇంటి వద్ద ఉండి చదువుకునే బదులుగా పాలమూరు యూనివర్సిటీ క్యాంపస్‌లో చదువుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటున్నది. ఇక్కడ వసతులు చాలా బాగున్నాయి. ప్రశాంతమైన వాతావరణం ఉంది. చిట్టడవిని తలపించే పీయూ క్యాంపస్‌లో చెట్ల కింద ప్రశాంతమైన వాతావరణంలో ఉద్యోగాన్వేషణ చేస్తున్నాం.
– కుర్మయ్య, ఎమ్మెస్సీ, మక్తల్, నారాయణపేట జిల్లా
టెట్ స్కోర్ పెంచుకుంటా…
గతంలో ఒకసారి ప్రిపరేషన్ లేకుండానే డీఎస్సీ రాశాను. అప్పుడు పెద్దగా అనుభవం లేదు. ఇప్పుడు టెట్ స్కోర్ పెంచుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తున్నా. అందుకే టెట్ కోసం ప్రిపేరవుతున్నా. పీజీ క్లాసులు లేనప్పుడు లైబ్రరీలోనే ప్రిపరేషన్ అవుతున్నా. సెలవు రోజుల్లో ఫుల్‌టైం లైబ్రరీకే అంకితమవుతాం. లైబ్రరీ నుంచి హాస్టల్‌కు వెళ్లిన తర్వాత అక్కడ కూడా చదువుకునేందుకు చక్కని అవకాశాలున్నాయి. ప్రభుత్వం చక్కని సదుపాయాలు కల్పించడం వల్లే మాలాంటి వాళ్లు చదువుకునేందుకు అవకాశం ఏర్పడింది. లైబ్రరీలో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. చక్కటి వాతావరణం ఉన్నది.
– మహేశ్వరి, ఎంఏ, గోనుపాడు, జోగుళాంబ గద్వాల జిల్లా
ప్రిపరేషన్ లేక ఉద్యోగం రాలేదు..
డిగ్రీలో ఉన్నప్పుడు ఎస్సై ఉద్యోగం కోసం ప్రయత్నించాను. అయితే సరైన ప్రిపరేషన్ లేక అప్పుడు ఉద్యోగం సాధించలేకపోయా. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కోచింగ్ తీసుకున్నాను. పీయూలో ఎమ్మెస్సీ చేస్తూనే ఎస్సై ఉద్యోగానికి ప్రిపేరవుతున్నాను. ఇక్కడ రెగ్యులర్‌గా అందించే ఉచిత కోచింగ్ కూడా ఎంతగానో ఉపయోపడుతున్నదది. యూనివర్సిటీలో ఆహ్లాదకరమైన వాతావరణం, భోజన వసతి ఉన్నది. అందుకే ఎలాంటి చీకూ చింత లేకుండా ఉద్యోగాల సాధనలో ఉన్నాం.
– దస్తప్ప, ఎమ్మెస్సీ, తిరుమలాపూర్, నారాయణపేట జిల్లా
ఒకసారి డీఎస్సీ రాశా..
2017లో టీటీసీ అయిపోగానే డీఎస్సీ రా శాను. అప్పుడు కనీసం ఏం చదవాలో ఎలా చదవాలో కూడా తెలియదు. కోచింగ్‌పైనా అవగాహన లేదు. దాంతో ఉద్యోగం రాలేదు. ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసి పీయూలో గణితం లో ఎమ్మెస్సీ చేస్తున్నా. ఇప్పుడు డీఎస్సీపై ఓ అవగాహన ఏర్పడింది. చక్కని ప్రణాళికతో ఉద్యోగం సాధించేందుకు సిద్ధమయ్యాను. ప్రిపరేషన్‌కు పీయూ చక్కటి వేదికగా మారింది. నాలాంటి వారెందరో ఇక్కడి లైబ్రరీలో గంటల కొద్దీ చదువుకుంటున్నారు.
– జి.కవిత, ఎమ్మెస్సీ, పెబ్బేరు, వనపర్తి జిల్లా
ఉద్యోగ సాధనే లక్ష్యంగా..
పీయూలో ఎమ్మెస్సీ జువాలజీ చేస్తూనే పో టీ పరీక్షల కోసం ప్రిపేరవుతున్నా. మొదటి నుంచి పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సా ధించాలనే ఏకైక లక్ష్యంతో చదువుకుంటున్నా. ప్రభుత్వం చాలా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నది. ఏది ఎంపిక చేసుకోవాలనే కన్ఫ్యూజన్ లే కుండా ముందుగానే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా. పీయూ క్యాంపస్ అద్భుతంగా ఉంది. లైబ్రరీలో చదువుకునేందుకు అన్ని అవకాశాలున్నాయి.
– శ్రీకాంత్, ఎమ్మెస్సీ, భైంసా, నిర్మల్ జిల్లా