మహబూబ్‌నగర్, మార్చి 19 : ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో లబ్ధిదారులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశమందిరంలో శనివారం ట్రాన్స్పోర్ట్ సెక్టార్‌కు సంబంధించిన లబ్ధిదారులకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. దళితబంధు పథకంతో ప్రతి కుటుంబం ఉన్నతస్థాయికి చేరేలా ప్రణాళిక ఉండాలన్నారు. లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10లక్షల చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని, వాటితో స్వ యం ఉపాధి పొందేందుకు అవసరమైన యంత్రాలను సమకూర్చుకోవాలని సూచించారు. లబ్ధిదారులకు నిధులు డ్రా చేసుకునే అవకాశం ఉండదని, యూనిట్లను కొనుగోలు చేసి న సంబంధిత కంపెనీకి ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. 22,23 తేదీల్లో లబ్ధిదారులను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి యూనిట్లను చూపించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారులు ఉన్నతస్థాయికి చేరుకునేలా యూనిట్ల గ్రౌండింగ్ ఉండాలని సూచించారు. లబ్ధిదారుల క్షేత్రస్థాయి పర్యటనకు అవసరమైన కా ర్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
పనుల్లో వేగం పెంచాలి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పునరావాస కేంద్రాల్లో పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో ఆర్అండ్ఆర్పై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీల వారీగా ఆర్అండఆర్ కేంద్రాల్లో చేపట్టాల్సిన పనులపై కలెక్టర్ సమీక్షించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, పంచాయతీరాజ్ తదితర శాఖలు ఇప్పటివరకు చేపట్టిన పనులకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ట్రాన్స్‌కో ఎస్ఈ మూర్తిని కలెక్టర్ ఆదేశించారు.
అంచనాలను సిద్ధం చేయాలి
మనఊరు-మనబడి కార్యక్రమానికి ఎంపికైన 291 పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి అంచనాలను సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లో విద్యాశాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మనఊరు-మనబడి అమలులో భాగంగా పాఠశాలల్లో నూతన గదుల నిర్మాణం, పాత గదుల మరమ్మతు, టాయిలెట్లు తదితర పనులు చేపట్టేందుకు అంచనాలను తయారు చేసి సమర్పించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, మండల మండల ప్రత్యేకాధికారి, ఎంఈవో, ఎంపీఈవోలు బృందం గా ఏర్పడి శిథిలావస్థకు చేరిన భవనాలను పరిశీలించాలని ఆదేశించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు ధృవీకరించిన తర్వాత శిథిల భవనాలను తొలగించాలని సూచించారు. పాఠశాల సామగ్రి ధరల నిర్ణయం, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాల తొలగింపు, అకౌంట్ల నిర్వహణ, సాంకేతికపరమైన శిక్షణపై కలెక్టర్ సమీక్షించారు. 21న రెవెన్యూ సమావేశ మందిరంలో సమీక్ష ఉంటుందని, సమావేశానికి ఎంఈవోలతోపాటు ఎంఐఎస్ అపరేటర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు హాజరుకావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవార్, సీతారామారావు, పీఆర్ ఎస్ఈ శివకుమార్, మిషన్ భగీరథ ఎస్ఈ వెంకటరమణ, ట్రాన్స్‌కో జిల్లా అధికారి మూర్తి, డీఈవో ఉషారాణి, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, టీఎస్ఎంఐడీసీ ఈఈ జైపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.