గద్వాల, మార్చి 19 : దళితులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం ప్రారంభించిన దళితబంధు పథకం ఓ వరం లాంటిందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలోపేతం కావాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. శనివారం జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్లో జిల్లా షెడ్యూల్డు కులాల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దళితబంధు పథకం అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ శ్రీహర్ష తో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని, వారి అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదన్నారు.
కానీ నేడు సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి దళితులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో దళితబంధు తీసుకొచ్చినట్లు చెప్పారు. మిదటి విడుతగా ప్రతి నియోజకవర్గానికీ 100 యూనిట్లు కేటాయించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో అర్హులైన లబ్ధిదారులందరికీ ఈ పథకాన్ని అమలు చేసే ఆలోచనలో ప్ర భుత్వం ఉన్నదన్నారు. దళితబంధుతో లబ్ధి పొంది మ రో పది మందికి ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు అం దించి వారికి ఆర్థికంగా చేయూతనిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తెలంగాణకు ఇతర ప్రాంతాల నుంచి వలస వస్తున్నారని తెలిపారు.
అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ దళితుల అభివృద్ధి కోసమే దళితబంధు ప్రారంభించినట్లు చెప్పారు. అందరూ ఒకే యూనిట్ ఏర్పాటు చేసుకోకుండా వివిధ రకాలు నెలక్పొల్పితే ఉపాధి దొరుకుతుందన్నారు. ప్రముఖ బిజినెస్ విశ్లేషకులు విశ్వేశ్వర్‌రెడ్డి ఈ పథకం కింద ఏ యూనిట్ నెలకొల్పితే ఎక్కువగా అభివృద్ధి చెందవచ్చో ప్రొజెక్టర్ సాయంతో వివరించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్‌బాబు, జెడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, నజుమున్నీసాబేగం, రాజారెడ్డి, జెడ్పీటీసీలు పద్మ, రాజశేఖర్ ఉన్నారు.