
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, అక్టోబర్ 29 : రక్తదానంతో మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చని ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నా రు. పోలీస్ ప్లాగ్డేను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. అనంతరం పోలీసు అధికారులతో కలిసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణతోపాటు సమాజ శ్రేయస్సుకు పోలీసులు కృషి చేస్తున్నారన్నారు. రక్తదాన శిబిరాల నిర్వహణలో జిల్లా పోలీసులకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉందన్నారు. రెడ్‌క్రాస్, లయన్స్ క్లబ్ వంటి వివిధ స్వచ్ఛంద సంస్థలకు రక్తం అందించడంలో పోలీస్ శాఖ ప్రధాన వనరుగా ఉంటుదన్నారు. అలాగే యువత రక్తదానంలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి రక్తం కొరత ఏర్పడకుండా అర్హులైన ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు. రక్తదానంతో మరింత ఉత్సాహాన్ని కలిగించి ఆరోగ్యాన్ని పెంచుతుందన్నారు. గతంలో రక్తదానం చేసిన తానూ పోలీసు అమరవీరుల స్మృతిలో భాగంగా రక్తదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. కాగా, శిబిరంలో 160 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ వారు సేకరించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ టీ శ్రీనివాసులు, రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ నటరాజ్, పోలీసు సంఘం అధ్యక్షుడు కే వెంకటయ్య, ఇన్స్పెక్టర్లు సురేశ్, శ్రీనివాస్, అప్పలనాయుడు, అశోక్, హన్మప్ప తదితరులు పాల్గొన్నారు.