
కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. అసలే కరోనాతో ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్న పేదలపై ధరలు దడ పుట్టిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగుతుండంతో జనం ఆందోళన చెందుతున్నారు. సిలిండర్ సైతం రూ.1000కి చేరువైంది. పెరిగిన నిత్యావసరాలు..కొండెక్కిన ధరలతో ఏం కొనలేక..ఏం తినలేక ఆందోళన చెందుతున్నారు.
ఎవరినీ ప్రశ్నించేలా లేదు..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న క్రమంలో నిత్యావసర సరుకుల ధరలు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. అయితే ధరలు ఎంత పెరిగినా కొనక తప్పదు కదా. ఊహించని విధంగా ధరలు పెరుగుపోతున్నాయి. పెరిగిన ధరలకు జనం క్రమంగా అలవాటుపడుతున్నారు. ఎవరు ఎవరిని ప్రశ్నించే పరిస్థితి లేదు. మా వద్ద పనిచేసే గుమాస్తాల జీతం కూడా పెంచాల్సిన పరిస్థితి. నెలకు రూ.12వేలు, రోజుకు రూ.100 బత్తా ఇస్తే తప్పా పనిచేసేందుకు ముందుకు రావడం లేదు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనాతో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న జనానికి ధరల పెంపుతో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆగకుండా పెరుగుతుండం తో ఆందోళన చెందుతున్నారు. సిలిండర్ ధరలు సైతం రూ.1000కి చేరువయ్యాయి. ఉల్లిగడ్డ కేజీ రూ.50, వంటనూనె రూ.160, కందిపప్పు రూ.125, పల్లి రూ.135 ఇలా అన్ని ధరలూ ఆకాశాన్నంటుతున్నాయి. మరోవైపు కూరగాయల ధరలు సైతం గాయాలు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్స్‌ప్రెస్ వేగంతో పెరుగుతుండటంతో రవాణాపై భారం పడి అన్ని ధరలు దూసుకెళ్తున్నాయి. దీంతో సామాన్యులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో ధరలు పెరగలేదని.. ఇప్పుడు కనీవీనీ ఎరుగని రీతిలో ఇంధనం ధరలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్నాళ్లూ లాక్డౌన్.. ఇప్పుడు ధరలు..
ఇప్పటికే కరోనా, లాక్‌డౌన్‌తో అతలాకుతలమవుతున్న జనం ఇప్పుడు భగ్గుమంటున్న ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, బియ్యం, ప ప్పులు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, ఇంటి అ ద్దెలు విపరీతంగా పెరిగాయి. బుధవారం మహబూబ్‌నగర్ పట్టణంలో లీటర్ పెట్రోల్ ధర రూ.113.10, డీజిల్ ధర రూ.106.23కు చేరుకున్నది. అక్టోబర్ నెలలోనే 19 సార్లు ఇంధనం ధరలు పెరిగాయి. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న ధరలకు ఎక్కడ ఫుల్స్టాప్ పడుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజీల్ ధరల ప్రభావం అన్ని వస్తువులపై పడుతున్నది. రవాణా చార్జీలు పెరిగిపోతుండడంతో బియ్యం, పప్పులు, ఉప్పులు, పాలు, కూరగాయల ధరల పెరుగుదల ఊహించని విధంగా ఉన్నది. ఇంధనం ధరలు భారీగా పెరగడంతో చాలా మంది బైక్‌లను ఇంటికే పరిమితం చేస్తున్నారు. గద్వాల మండలం ములకలపల్లికి చెందిన నర్సింహులు పెరిగిన పెట్రోల్ ధరలు భరించలేక గుర్రాన్ని కొనుగోలు చేసి దానిపైనే సవారీ చేస్తున్నాడు. చాలా మంది సైకిళ్లు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. మరికొందరేమో బ్యాటరీ బైక్స్ కొనుగోలు చేస్తున్నారు. కారు ఫుల్ కెపాసిటీ ఉంటే తప్పా బయటకు తీయని కుటుంబాలు కూడా ఉన్నాయి. భవిష్యత్‌లో చాలా మంది కార్లను ఇంటికే పరిమితం చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. అనవసరంగా ఇంధనంతో నడిచే కార్లు కొన్నామని.. కొంత భారం ఎక్కువైనా బ్యాటరీ కారు కొంటే సరిపోయేదని మదనపడుతున్నారు.
వంటగ్యాస్‌పై పెరిగిన భారం..
వంటగ్యాస్ ధరను ఇటీవలే రూ.15 పెంచారు. దీంతో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ రూ.955కు చేరుకున్నది. సబ్సిడీ రూ.40 మాత్రమే వస్తున్నది. కొందరు వినియోగదారులు సబ్సిడీ కూడా సక్రమంగా రావడం లేదని చెబుతున్నారు. సెప్టెంబర్ 1న కూడా గ్యాస్ సిలిండర్ ధర రూ.25, ఆగస్ట్ 17న మరో రూ.25 పెరిగింది. భవిష్యత్‌లోనూ సిలిండర్ ధరల పెంపు మాత్రం తప్పనిసరిగా ఉంటుందని అర్థం అవుతున్నది. ఈ లెక్కన కొత్త ఏడాది కంటే ముందే రూ.1000ని దాటే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నది. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే చివరకు పాత పద్ధతి వస్తుందేమోననే భయం నెలకొంటున్నది. గ్యాస్ ధరల కారణంగా పేదలు తిరిగి కట్టెల పొయ్యితో వంట చేయాల్సి వస్తుందేమోననే ఆందోళన చెందుతున్నారు.
పూట గడవడం భారంగా మారింది..
పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో పూట గడవడం కష్టంగా మారింది. కూరగాయలు, వంట గ్యాస్ ధరలు ఎప్పుడు ఎంత పెరుగుతున్నాయో అర్థం కావడం లేదు. బజార్‌కు రూ.వెయ్యి తీసుకుపోతే కూడా చేతి సంచికి సరుకులు రావడం లేదు. పెరుగుతున్న ధరలు అదుపు చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఎంతైనా ఉన్నది.
ధరలతో నష్టపోతున్నాం..
టమాటా బాక్సులో 22 కిలోలు ఉండ గా, అందులో 10 కిలోలు డ్యామే జీ ఉంటున్నాయి. బాక్సు రూ. 800 పడుతుంది. కేజీ టమా టా రూ.50 అమ్మినా మాకే ఎ దురుపడుతున్నది. వారంలో రూ.10వేలు అప్పు అయ్యిం ది. ఎండలకు కూరగాయలు పా డవుతున్నాయి. పాలకూర మాకే రూ.10కి ఐదు ఇస్తున్నారు. ఇక జనాలకు ఎంతకు అమ్మాలి. ఇలా అయితే పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారం బంద్ చేసుకునేది మేలు అన్నట్లుగా ఉన్నది. ధరలు తగ్గితే మాకు కాస్త లాభాలు వస్తాయి.
వ్యాపారం తగ్గింది..
పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతంలో పప్పు, ఉప్పు, నూనెలు, కూరగాయలు ప్రజలకు అందుబాటు ధరలో ఉండేవి. ప్రస్తుతం ప్రతి వస్తువుపై ధరలు పెరగడంతో గతంలో రెండు కిలోలు కొనేవారు ఇప్పుడు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. గిరాకీలు నామమాత్రంగా ఉన్నాయి. ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు తగ్గేలా చర్యలు తీసుకుంటే అందరికీ మేలు. వ్యాపారాలు పెరిగే అవకాశం ఉంటుంది.
ధరలు పెంచడం అన్యాయం..
గ్యాస్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలు పెం చడం అన్యాయం. కరోనా సమయంలో జీవించడమే కష్టంగా మారిన తరుణంలో ప్రజల గురించి కాకుండా లాభార్జన మీద దృష్టి సారించడం తగ దు. సామాన్యుడు వాహనం బయటకు తీయాలంటేనే భయపడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం తీరుతో ప్రజలకు నష్టం కలుగుతున్నది. డీజిల్, పెట్రోల్ ధరలు పెరగడంతో పరోక్షంగా అన్ని రంగాలపై ప్రభావం పడుతున్నది. ఆహారధాన్యాలు, నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలు వంటి వాటి ధరలు పెరుగుతాయి.