
భూత్పూర్, అక్టోబర్ 31: ఎవరు ఎన్ని అవాంతరాలు సృష్టంచినా కర్వెన ప్రాజెక్టు పనులను పూర్తిచేసి సాగునీరందిస్తామని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే అన్నాసాగర్‌లోని తన నివాసంలో మాట్లాడుతూ వలసల జిల్లాలను ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రూ.45వేల కోట్లతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మంజూరు చేశారని తెలిపారు. ప్రాజెక్టు మంజూరైనప్పటి నుంచి ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ఎన్నో రకాల కుట్రలు పన్ని చివరకు కోర్టు ద్వారా స్టే తీసుకురావడం సిగ్గుచేటని ఎమ్మెల్యే దుయ్యబట్టారు. ప్రాజెక్టు నిర్మాణంపై స్టే రావడంతో కొందరు కాంగ్రెస్, బీజేపీ నాయకులు టపాకాయలు కాల్పడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయితే నీళ్లు వస్తే ఎన్నో కుటుంబాలు సంతోషంగా జీవిస్తాయని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత ఇంకా ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగడం సిగ్గు చేటన్నారు. ఇలాంటి స్టేలు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోలేవని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ ప్రజానీకమంతా టీఆర్ఎస్ వైపు నిలబడాలని కోరారు. అనంతరం 68మందికి రూ.32,69,050 విలువగల సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులను అందజేశారు. సీడీపీ నిధుల ద్వారా మూసాపేటలో యాదవ సంఘం భవన నిర్మాణానికి రూ.4లక్షలు, నిజాలాపూర్‌లో వంశరాజుల భవన నిర్మాణానికి రూ.5లక్షలు, సంకలమద్దిలో మహిళా సంఘం భవన నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున ప్రొసీడింగ్‌లను అందజేశారు. రెండు సంవత్సరాలుగా సీడీపీ నిధులు మంజూరు కానందున ఇవ్వలేక పోయామని ఇప్పుడు మంజూరయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. దేవరకద్ర మండలం చౌదర్‌పల్లికి చెందిన భవానికి సర్జరీ కోసం డబ్బులు కావాలని వాట్సాప్ ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే స్పందించి రూ.లక్ష ఎల్వోసీని అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఎంపీపీ నాగార్జునరెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, జెట్టి నర్సింహరెడ్డి, లక్ష్మీనర్సింహయాదవ్, శ్రీకాంత్‌యాదవ్, మనెమోని సత్యనారాయణ, పొన్నకల్ మహమూద్, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.