
మహబూబ్‌నగర్‌టౌన్, అక్టోబర్ 31: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో చెత్త సమస్యకు చెక్‌పెట్టేందుకు ఇప్పటికే సెగ్రిగేషన్ యంత్రాన్ని కోయిల్‌కొండ ఎక్స్‌రోడ్డులోని డంపింగ్ యార్డులో ఏర్పాటు చేస్తున్న విషయం విదితమే. మున్సిపల్ శాఖ మరో ప్రయోగాత్మకంగా డ్రైనేజీల్లో చెత్తను వేరు చేసేందుకు రోబోటిక్ డివైజ్ ఏర్పాటుకు శ్రీకారం చుడుతుంది. జీహెచ్ఎంసీ ఇప్పటికే ఈ సిస్టం అమలుపై దృష్టి సారించారు. పలుచోట్ల అందుబాటులో ఉన్నాయి. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో ప్రధానంగా మూడు డ్రైనేజీలను మున్సిపల్ శాఖ గుర్తించింది. పెద్ద చెరువుకు, న్యూటౌన్‌కు వెళ్లే పెద్ద డ్రైన్, బస్టాండ్ సమీపంలోని డ్రైన్, అబ్దుల్‌ఖాదర్ దర్గా వద్ద డ్రైనేజీలో ఏర్పాటు చేయనున్నారు. పెద్ద చెరువులోకి ప్లాస్టిక్ వ్యర్థాలు వెళ్లకుండా ఈ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పనులు చేపడుతున్నారు. అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్ మున్సిపల్ అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. డ్రైనేజీల్లో మార్కింగ్ చేసి పోల్స్ ఏర్పాటు చేశారు.
చెత్తను వేరు చేస్తుంది
డ్రైనేజీలో నీటి ప్రవాహం రోబోటిక్ డివైజ్నుంచి బయటకు వెళ్తుంది. అందులో చెత్త నిండిన తర్వాత సెన్సార్ సిస్టం ద్యారా పారిశుధ్య విభాగ అధికారులకు సమాచారం వెళ్తుంది. రోబోటిక్ డివైజ్ ప్లాస్టిక్ కవర్లు, చెత్తచెదారాన్ని పక్కకు డంప్ చేస్తుంది. అన్ని వ్యర్థాలను వేరుచేసి డంపింగ్ యార్డుకు తరలిస్తారు. కవర్లు, ప్లాస్టిక్ వస్తువులను చెత్తసేకరణ కేంద్రానికి పంపిస్తారు. ఈ యంత్రం ద్యారా మున్సిపల్ సిబ్బందికి కొంత వెసులు బాటు కలుగుతుంది. మున్సిపల్ అధికారులు పనులపై దృష్టి సారించారు. పెద్దచెరువులోకి ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ వ్యర్థాలు వెళ్లకుండా రోబోటిక్ డివైస్ ద్వారా వేరుచేస్తారు.
ప్రయోగాత్మకంగా అమలు
పెద్దచెరువుకు వెళ్లే, ప్రధాన మూడు డ్రైనేజీల్లో ప్లాస్టిక్, బాటిల్స్, వ్యర్థాలు వెళ్లకుండా రోబోటిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. చెత్త నిండిన తర్వాత సెన్సార్ ద్వారా సమాచారం వస్తుంది. చెత్త వేరుచేసి వ్యర్థాలను డంపింగ్‌యార్డుకు, ప్లాస్టిక్, బాటిల్స్ డీఆర్సీకి పంపిస్తాం. ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. త్వరలో పూర్తి చేస్తాం.