
మహబూబ్నగర్, అక్టోబర్ 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ వస్తే ఏమొస్తది.. అనే వాళ్లకు నిలబడి నిజాలు చెప్తోంది నిజాలాపూర్ గ్రామం. 2014కు ముందు గ్రామంలో సాగు నీరు లేక వ్యవసాయం చేసే పరిస్థితి కనిపించక అనేకమంది వలసలు వెళ్లారు. గ్రామంలోని 115 కుటుంబాలు బతుకుదెరువు కోసం హైదరాబాద్, ముంబయి తదితర ప్రాంతాలకు వలస వెళ్లాయి. వారంతా వివిధ కూలీ పనులు చేస్తూ జీవించారు. మరికొందరు కుటుంబాలను ఊరిలో వదిలేసి వలసలు వెళ్లారు. అయితే తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక క్రమంగా పరిస్థితులు మెరుగుపడటంతో వలసలు వెళ్లిన వారంతా తిరిగి వచ్చేశారు. ఇప్పుడు గ్రామంలోనే ఉంటూ వ్యవసాయం చేసుకునే పరిస్థితి వచ్చిందని గర్వంగా చెబుతున్నారు. అప్పట్లో బోర్లు, బావుల్లో నీళ్లు అడుగంటిపోయి వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతే కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు గ్రామస్తులు. తిరిగి తమకు మంచి రోజులు వస్తాయని కలలో కూడా ఊహించలేదని చెబుతున్నారు. గతంలో వర్షం పడితే పంటలు లేకుంటే లేదు. వర్షం పడిన రోజే దున్నాలే.. రెండు రోజుల్లో పంటలు వేసుకోవాలె. మళ్లీ వర్షం కోసం ఎదురుచూడాలె. వర్షం పడితే పంట పండుతుంది. లేదంటే ఎండుతుంది. గాలిలో దీపంలా తమ బతుకులుండేవప్పుడు. కానీ తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ చొరవతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీళ్లు రావడంతో దశ మారిపోయింది. ఇప్పుడు ఎటుచూసినా నీళ్లే. వాగులు, చెరువులు, కుంటలు, కాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. బోర్లు, బావులు నిండిపారుతున్నాయి.
తెలంగాణకు ముందు గ్రామంలో ఉన్న 875 ఎకరాల వ్యవసాయ భూమిలో బోర్లు, బావుల కింద కనాకష్టంగా సాగుతున్న భూమి కేవలం 150ఎకరాలు మాత్రమే. కానీ ఇప్పుడు అందులో 850ఎకరాల భూమికి సాగునీరు అందుతోంది. మిగతా 25 ఎకరాలు కూడా సాగయ్యేవే. కానీ నీళ్లు ఎక్కువై ముంపునకు గురవుతున్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. నీళ్లే లేని దశ నుంచి నీళ్లు ఎక్కువైపోయే దశకు తెలంగాణలోని పల్లె చేరుకున్నది.
నాడు బీడు.. నేడు సిరులు
నాకు ఆరెకరాల పొలం ఉంది. రెండు బోర్లున్నా నీళ్లు లేక 2014కు ముందు ఎకరా ఎకరన్నరం పొలం చేసేటోన్ని. వర్షాలు లేక చెరువులు, కుంటలు కూడా ఎండిపోయేవి. బోర్లల్లో నీళ్లొచ్చే పరిస్థితి లేకుండే. కూలీ పని చేసి కుటుంబాన్ని నెట్టుకొచ్చేటోన్ని. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో కేఎల్ఐ నీళ్లు రావడంతో మా దశ మారిపోయింది. ఎండిపోయిన రెండు బోర్లు పుంజుకున్నాయి. వాటి అవసరం కూడా లేకుండా చెరువు నుంచి కాలువ ద్వారా నేరుగా పొలంలోకి నీళ్లు వస్తున్నాయి. ఇంచు భూమి కూడా వదలకుండా వ్యవసాయం చేస్తున్నా. ప్రభుత్వం సబ్సిడీ ట్రాక్టర్ ఇచ్చింది. ప్రభుత్వం ద్వారా బర్రెల షెడ్డు కూడా వచ్చింది. ఓ వైపు వ్యవసాయం చేసుకుంటూనే మరోవైపు పశుపోషణ ద్వారా రెట్టింపు ఆదాయం సంపాదిస్తున్నాను.
పట్నం పోయేటోన్ని..
ఊర్లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు, కులవృత్తి అయిన చేపల వేటకు అవకాశం లేక ఉపాధి కరువై పట్నం(హైదరాబాద్) వెళ్లి వాచ్మెన్గా పనిచేసేటోన్ని. తెలంగాణ వచ్చినాక ఊరికి నీళ్లు వచ్చినాయని తిరిగి వచ్చినాం. గ్రామంలోని చెరువుతోపాటు వాగులో పుష్కలంగా నీళ్లున్నాయి. ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను వదిలింది. దీంతో చేపల ఉత్పత్తి పెరిగింది. నిత్యం 15నుంచి 20కిలోల చేపలు పడుతున్నా. రూ. వెయ్యి నుంచి రూ.2వేల వరకు సంపాదిస్తున్నా. వ్యవసాయం కూడా చేసుకుంటున్నా. ఇదంతా సీఎం కేసీఆర్ చలవే.
తాగునీరు కూడా లేకుండే..
మాకు మూడున్నర ఎకరాల పొలం ఉన్నది. తెలంగాణ రాక ముందు సాగు, తాగు నీళ్లు లేక అవస్థలు పడ్డాం. తాగడానికి నీళ్లు లేక ఒండు నీళ్లు తాగి బతికినం. మా జీవితాంతం ఇదే పరిస్థితి ఉంటదనుకున్నం. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత మెల్లమెల్లగా మా జీవితాల్లో మార్పు వచ్చింది. తాగడానికి శుద్ధమైన మిషన్ భగీరథ నీళ్లు వచ్చినయి. అలాగే కేఎల్ఐ ద్వారా మా బీడు పొలాల్లో ఇప్పుడు బంగారు పంటలు పండుతున్నాయి. ఇదంతా తెలంగాణ ఏర్పడటం వల్లే సాధ్యమైనది.
గ్రామం: నిజాలాపూర్
జనాభా : 2,658 (2011 లెక్కల ప్రకారం)
ఇండ్లు : 526, కుటుంబాలు : 668
గతంలో వలస వెళ్లిన కుటుంబాలు : 115
ఇప్పుడు తిరిగి వచ్చిన వారు : 100 శాతం
వ్యవసాయ భూములు : 875 ఎకరాలు
తెలంగాణకు ముందు సాగు భూమి : 150 ఎకరాలు
ఇప్పుడు సాగు నీరు అందుతున్న భూములు : 850 ఎకరాలు
(25 ఎకరాలు కూడా నీటి ముంపునకు గురి అవుతున్నది.)