
పోషకాల గని సీతాఫలం.. రుచితోపాటు ఔషధ గుణాలు ఉండడంతో మార్కెట్లో డిమాండ్. అందులో పాలమూరు మధుర ఫలం అంటే మరీను.. అందుకే వీటి కోసం ఐస్‌క్రీం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. స్కూప్ ఐస్‌క్రీం కంపెనీ నవాబ్‌పేట మండల మహిళా సమాఖ్యతో ఒప్పందం కుదుర్చుకున్నది. రియల్ సీతాఫల్ పేరిట స్కూప్స్ కంపెనీ ఐస్‌క్రీం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో నాడు గ్రామీణులు అటవీ ప్రాంతాలకు వెళ్లి ఎన్నో కష్టాలతో పండ్లను సేకరించినాఎలా విక్రయించాలో తెలియక ఇబ్బందులు పడేవారు. కానీ నేడు ప్రాసెసింగ్ సెంటర్లకు తరలించి పండు నుంచి గుజ్జును వేరు చేసి విక్రయిస్తున్నారు. దీంతో వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
మహబూబ్‌నగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : సీతాఫలం.. పేదవాడి ఆపిల్. కస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్వీట్ సోప్ వంటి పలు పేర్లున్నాయి. శీతాకాలంలో దొరికే పండు కాబట్టి సీతాఫలం అనే పేరు వాడుకలోకి వ చ్చింది. సీతాఫలంలో పోషకాలు మెండు. రుచితో పాటు ఔషధ గుణాలున్న పండ్లు కాబట్టే వీటికి ఎంతో డిమాండ్. ఎలాంటి రసాయనాలు లేకుండా కేవలం సహజమైన వా తావరణ పరిస్థితుల్లో లభించే ఏకైక పండు. కార్బోహైడ్రేట్లను పుష్కలంగా కలిగి ఉండే ఈ పండ్లు హైపో థైరాయిడ్, చిగుళ్ల వాపు, కాళ్ల నొప్పులు, క్యాల్షియం లోపాన్ని నివారించటానికి ఉపయోగపడతాయి. ఒకప్పుడు సీతాఫలాలు సేకరించే గ్రామీణులు వాటిని విక్రయించేందుకు నానా అ వస్తలు పడేవారు. కానీ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. పేదోడి ఆపిల్‌కు భారీ డిమాండ్ వచ్చేసింది. పాలమూరు గుట్టలు, అడవుల్లో విస్తారంగా లభించే ఈ ఫలాల కోసం ఇప్పుడు ఐస్ క్రీం కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. పాలమూరు సీతాఫలం ఎంతో ప్రత్యేకమని గుర్తించిన స్కూప్ ఐస్ క్రీం కంపెనీ నవాబ్‌పేట మండల మహిళా సమాఖ్య తో ఒప్పందం కుదుర్చుకున్నది. దీంతో ఇన్నాళ్లు అడవుల్లో సేకరించిన సీతాఫలాలు ఎలా విక్రయించాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న స్థానికులకు చక్కని ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.
పాలమూరు ప్రత్యేకం..
పాలమూరు అంటేనే ఒకప్పుడు వలసలు గుర్తొచ్చేవి. ఇప్పుడు వలసలు పోయి రివర్స్ మైగ్రేషన్ ప్రారంభమైం ది. అదలా ఉంచితే పాలమూరు అంటే సీతాఫలాలు కూ డా గుర్తుకువస్తాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని నల్లమల, ఇతర అడవుల్లో లభించే సీతాఫలాలు అంటే ముంబై, హైదరాబాద్ వాసులు బాగా ఇష్టపడుతారు. అ యితే సాధ్యమైనంత త్వరగా తినకుంటే పాడైపోయే సీ తాఫలాలను ఐస్ క్రీం తయారీలోనూ వినియోగించడం ప్రారంభించాక వీటికి డిమాండ్ భారీగా పెరిగింది. స్కూప్స్ ఐస్ క్రీం కంపెనీ ఫ్రూప్స్ పండ్లతో తయారు చేసే ఐస్ క్రీంలలో రియల్ సీతాఫల్ పేరిట మార్కెట్లోకి విడుదల చేసింది. వీటికి ఎంతో డిమాండ్ ఏర్పడింది. గతంలో సీతాఫలాలు సేకరించినా అమ్ముకునేందుకు పెద్దగా అవకాశాలు లేక ఇబ్బందులు పడేవారు. ఎంతో కొంత గిట్టుబాటు అయితే చాలన్నట్లుగా ఉండే వాళ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. మహబూబ్‌నగర్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సీతాఫలాల సేకరణ ప్రారంభించాక మొక్కుబడిగా సేకరించిన వారు కూడా ఉపాధి అవకాశాల కోసం సీతాఫలాల సేకరణ ప్రారంభించారు.
ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభంతో మారిన దశ..
సీతాఫలాల ద్వారా ఉపాధినివ్వాలనే ఆలోచన చేసింది సెర్ప్. జిల్లాలో అత్యధికంగా సీతాఫలాలు లభించే నవాబ్‌పేట మండలంలో రూ.5 లక్షలు ఖర్చు చేసి సీతాఫలాల ప్రాసెసింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రముఖ ఐస్ క్రీం తయారీ సంస్థ స్కూప్స్తో ఒప్పందం కూడా చేసుకున్నారు. నవాబ్‌పేటలోని మండల మహిళా సమాఖ్య భవనంలో ప్రాసెసింగ్ సెంటర్ ప్రారంభించారు. మండలంలోని 12 వందల మంది ప్రాసెసింగ్ సెంటర్‌కు సీతాఫలాలు సేకరించి విక్రయిస్తున్నారు. గతేడాది కేవలం నెల రోజుల్లో 33 టన్నుల సీతాఫలాలు సేకరించారు. ఒక్కో కి లోకు వాటి నాణ్యతను బట్టి రూ.10 నుంచి రూ.12 వ రకు ధర లభించింది. ఒక్కొక్కరు సుమారు 200 కేజీల నుంచి 500 కేజీలకు పైగా సీతాఫలాలు సేకరించారు. వీ టి నుంచి సుమారు 3 వేల కేజీల పల్ప్ (గుజ్జు)ను తయా రు చేసి స్కూప్స్ కంపెనీకి విక్రయించారు. ఒక్కో కేజీ ప ల్ప్కు రూ.208 ప్రకారంగా రూ. 6 లక్షల వరకు ఆదా యం వచ్చింది. అందులో నుంచి సీతాఫలాలు సేకరించి న వారికి, ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేసిన మహిళలు 35 మందికి రోజుకూ రూ.250 చొప్పున కూలి చెల్లించినా సుమారు రూ.75వేల వరకు ఆదాయం వచ్చింది. అయి తే గతేడాది తొలి ప్రయత్నంలోనే 1,235 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే పాలమూరు మధురమైన సీతాఫలాల రుచిని ఐస్క్రీంల ద్వారా దేశమంతటికీ పంచే అవకాశం లభించింది.
ఊహించని స్పందన..
మా మండలంలో సీతాఫలాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే సెర్ప్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నవాబ్‌పేటలో సీతాఫలం ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసింది. సుమారు 12 వందల మంది సీతాఫలాలు సేకరించి మాకు విక్రయించారు. గతేడాది 33 టన్నుల సీతాఫలాలు మేం సేకరించాం. ఈ ఏడాది కేవలం మూడు రోజుల్లో 3 టన్నుల సీతాఫలాలు సేకరించాం. సీతాఫలాలు తెంపుకొచ్చే వాళ్లు గతంలో మహబూబ్‌నగర్‌కు ఆటోలో పోయి అమ్ముకునే పరిస్థితి ఉండేది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, విక్రయించేందుకు రోజంతా సమయం పట్టేది. ఒక్కోసారి పండ్లు అమ్ముడుపోక వాటిని తిరిగి ఇంటికి తీసుకురావాల్సి వచ్చేది. దాంతో పెద్దగా లాభాలు ఉండేవి కాదు. కానీ ఇప్పుడు నేరుగా మాకే విక్రయిస్తున్నారు. మళ్లీ అడవుల్లోకి వెళ్లి కాయలు సేకరిస్తున్నారు. సమయం, ఖర్చులు మిగిలిపోయి ఆదాయం పెరుగుతోంది. ఇక మా వద్ద సేకరించిన గుజ్జును కిలో ప్యాకెట్ల చొప్పున ప్యాక్ చేసి ఫ్రీజర్‌లో నిల్వ ఉంచుతున్నాం. వీటిని స్కూప్స్ కంపెనీ వాళ్లు కొనుగోలు చేస్తున్నారు. గతేడాది అన్ని ఖర్చులు పోనూ రూ.75 వేల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నాం. వ్యాల్యూ యాడెడ్ వల్ల ఉన్న లాభాలు క్రమంగా గ్రామాలకు సైతం అందుబాటులోకి వస్తున్నాయి.
ఉన్నచోటే ఉపాధి..
సీతాఫలం ప్రాసెసింగ్ సెంటర్లో గు జ్జును ప్రాసెసింగ్ చేసే పని చేస్తున్నాం. రోజుకూ రూ.250 వరకు కూలీ లభిస్తుంది. సీతాఫలాల సీజన్ ఉన్నంత వర కు ఇక్కడ పని చేసుకునేందుకు అవకా శం ఉన్నది. ఎండాకాలంలో మామిడి ఒరుగులు తయారుచేసే పనులు ఉం టాయి. సీజన్ అయిపోయాక మా వ్యవసాయ పనులు చేసుకుంటాం. నాతో పా టు మరో 35 మంది ఈ ప్రాసెసింగ్ సెంటర్లో ఉపాధి పొందుతున్నారు. అలాగే మా మండలంలో సీతాఫలాలు సేకరించే సుమారు 12 వందల మందికి ఉపాధి లభిస్తున్నది.