
మహబూబ్నగర్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణలో ధాన్యం సేకరణపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతున్నది. ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు మాత్రం ఈ అంశం తమకు సంబంధించినది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే అంశంపై ప్రతిపక్షాల తీరుపై ఉలుకూ పలుకూ లేని రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత పూర్తిగా కేంద్రానిదే అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని రైతులు గుర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకోసం, తమ సంక్షేమం కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నా మిగతా పక్షాలు పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు. కేంద్రంపై మొండి వైఖరిపై అన్ని వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ వచ్చిన తర్వాత పుష్కలంగా సాగునీరు రావడంతో పాటు ఉచితంగా 24 గంటల విద్యుత్ అందించడంతో వ్యవసాయం పండుగగా మారింది. పుట్లు పుట్లుగా వడ్లు పండుతున్నాయి. అయితే తెలంగాణపై కక్ష గట్టిన కేంద్రం వడ్ల కొనుగోలుపై ససేమిరా అనడం అన్నదాతకు సంకటంగా మారింది. ఈ అంశంపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో చేస్తున్న పోరాటానికి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కనీసం సంఘీభావం కూడా తెలపకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉలుకూ పలుకూ లేకుండా వ్యవహరిస్తున్న రాష్ర్టానికి చందిన ప్రతిపక్ష ఎంపీలు సమాధానం చెప్పాలని పాలమూరు రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కేంద్రంపై తమ పోరాటం సాగుతుందని ఉమ్మడి జిల్లాకు చెందిన ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరి స్పష్టం చేయడమే కాకుండా తప్పనిసరిగా రైతులు పండించిన పంట కొనుగోలు చేయాల్సిందేనని వాళ్లు డిమాడ్ చేస్తున్నారు.
ధాన్యం కొనుగోలు చేయాల్సిందే..
తెలంగాణ వచ్చిన తర్వాత రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించింది. సముద్రంలో వృథాగా పోతున్న నీళ్లను సీఎం కేసీఆర్ పంటచేలకు మళ్లించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా పుష్కలంగా సాగునీరు అందించారు. సీఎం కేసీఆర్ లాగా ప్రధానికి ఓ విధానం ఉండుంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పంటను కొనమంటే కేంద్ర ప్రభుత్వం వెనకడుగువేస్తున్నది. కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా తీసుకువద్దాం అనే ఆలోచన లేదు కానీ రాష్ట్ర బీజేపీ నేతలు కేవలం వ్యక్తిగత విమర్శలు చేయడంలో మాత్రం ముందుంటారు. వ్యవసాయం పట్ల, రైతుల పట్ల అవగాహన ఉన్న నాయకులు లేరు కాబట్టే పరిస్థితి ఇలా ఉంది. ఆరునూరైనా కేంద్రం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిందే.
రైతు ప్రయోజనాలు కాపాడరా..
పార్లమెంట్లో మేం కేవలం రైతుల ప్రయోజనాలను మాత్రమే ప్రభుత్వ దష్టికి తెస్తున్నాం. దేశానికి అన్నంపెట్టే రైతు ప్రయోజనాలను కేంద్రం కాపాడుతుందా లేదా… పండించిన ధాన్యాన్ని కొంటరా లేదా.. మీ నుంచి ఎంత వీలవుతుందో మందు ఆసంగతి చెప్పండి అని ముఖ్యమంత్రి, మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్ కేంద్రం చెవులకు ఎక్కడం లేదు. రైతులు పండించిన పంట మీదే దేశ ఆర్థిక వ్యవస్థ ఆధారపడి ఉంది. రాజకీయంగా ఎదుగుతున్న రాష్ర్టాన్ని, పార్టీని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు. దేశాన్ని పాలించే ప్రభుత్వం రాజనీతిని పాటిస్తున్నదా అన్నదే మా సందేహం. ఇప్పటికైనా మా రైతులు పండించిన పంటను ఎప్పుడు కొంటరు.. ఎంత కొంటరో పార్లమెంట్లో ప్రకటన చేయాలి.