
పెద్దసారు పొలం బాట పట్టారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్.. తిరుగు ప్రయాణంలో పలువురు రైతులతో ముచ్చటించారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ సమీపంలో 44 హైవే పక్కన మినుములు, వేరుశనగ పంటలను పరిశీలించారు. అలాగే కొత్తకోట మండలం విలియంకొండ తండా పంచాయతీ పరిధిలో వేరుశనగ, కల్లంలో ఆరబోసిన పంటను చూసి రైతులతో ముచ్చటించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ కాయలను రుచి చూశారు. వరి పండిస్తే కేంద్రంతో యుద్ధం చేయాల్సి వస్తుందన్నారు. మొదటి పంటగా మాత్రమే వరిని సాగు చేయాలని సూచించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని పలువురు అన్నదాతలు సీఎంకు వివరించారు. ఆకస్మికంగా తమ పంట పొలాల్లోకి రావడంతో అక్కడున్న గిరిజన రైతులు సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా తమ వద్దకు రాలేదన్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టి తమతో మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారని పలువురు పేర్కొన్నారు. ఆయనవెంట మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
పంట పొలాల్లో
మహబూబ్‌నగర్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం కష్టపడే అన్నదాతను ఎవరైనా పలకరించి వ్యవసాయం ఎలా ఉందని అడిగితే ఆ రైతు ఎంతో సంతోషిస్తాడు. అలా అడిగిన వ్యక్తి సాక్షాత్తు సీఎం కేసీఆర్ అయితే ఆ రైతు సంతోషానికి హద్దులుంటాయా… అవును ఊహించని విధంగా ముఖ్యమంత్రి తమ పొలంలోకి వచ్చి రైతుల కష్టసుఖాలు, పండిస్తున్న పంటలు, గిట్టుబాటు మొదలైన అంశాలను అడిగి వారితో కాసేపు ఉండి ఫొటోలు దిగి వెళ్లారు. అనుకోని విధంగా ముఖ్యమంత్రి రాకతో అన్నదాతలు పులకించారు. గురువారం జోగుళాంబ గద్వాల పర్యటన ముగించుకుని రోడ్డు మార్గంలో 44వ నెంబర్ జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ వెళ్తున్న సీఎం కేసీఆర్ హఠాత్తుగా కొత్తకోట మండలం విలియంకొండ తండా వద్ద రోడ్డు పక్కన వడ్లు ఆరబోసిన రైతులను చూసి తన వాహనాన్ని ఆపారు. వెంటనే బస్సు దిగి నేరుగా అక్కడున్న గిరిజన రైతుల వద్దకు వెళ్లారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నెకరాల సాగు భూమి ఉంది… ఏం పంటలు పండిస్తున్నారని ఆరా తీశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పుష్కలంగా సాగు నీరు, 24 గంటల ఉచిత కరెంటు అందించడం వల్ల మా దశ తిరిగిందని వనపర్తి జిల్లా పెద్దగూడెంకు చెందిన కౌలు రౌతు గోకం వెంకటయ్య ముఖ్యమంత్రి కేసీఆర్ తో అన్నారు. గోకం వెంకటయ్య వేరుశనగ పంట దగ్గరికి వెళ్లి పరిశీలించారు. సాగు విధానం, దిగుబడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని వేరుశనగ చెట్లను భూమి నుండి తీసి వేరుశనగ కాయలను స్వయంగా పరిశీలించారు. నీళ్లు, కరెంటు పుష్కలంగా ఉండడంతో పంటల దిగుబడి బాగా పెరిగిందని రైతు వెంకటయ్య సీఎంకు వివరించారు. జూన్ 9న పంట వేశానని… ఈ నెల 15 లేదా 16న పల్లికాయలు తెంపుతామని వెంకటయ్య సీఎంకు వివరించారు. రోడ్డు పక్కనే తండాకు వెళ్లే మార్గంలో వడ్లు ఆరబోసిన రైతులు కీమ్యానాయక్, కృష్ణమ్మతో ముఖ్యమంత్రి మాట్లాడారు. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఊహించని విధంగా తమ పంట పొలాల్లోకి రావడంతో అక్కడున్న గిరిజన రైతులు సీఎంతో ఫోటోలు దిగడానికి ఆసక్తి చూపించారు. ముఖ్యమంత్రి మా వద్దకు వచ్చి మేం ఏం పండిస్తున్నాం… మా పరిస్థితి ఏమిటి అనేది స్వయంగా పరిశీలిస్తారని అనుకోలేదని రైతులు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మా వద్దకు రాలేదు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టి మాతో మాట్లాడి మా కష్టాలు తెలుసుకున్నారని రైతులు కీమ్యానాయక్, కృష్ణమ్మ తెలిపారు. మీ తండాకు ముఖ్యమంత్రి వచ్చిండ్రంట కదా అని అందరూ ఫోన్ చేసి అడుగుతున్నరు… ముఖ్యమంత్రి రావడమే కాదని మా బాగోగులు, మా పంటల గురించి కూడా అడిగి తెలుసుకున్నారని అందరికీ చెబుతున్నామని కీమ్యానాయక్ అన్నారు. స్వయంగా పల్లి చేనులో దిగి పల్లీలు తెంపి వాటి నాణ్యతను పరిశీలించడం గొప్ప విషయమని రైతు వెంకటయ్య అన్నారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, పట్నం నరేందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్ రెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, వ్యవసాయ శాఖ అధికారులున్నారు.
రైతులతో సీఎం మాటా మంతి
సీఎం కేసీఆర్: ఏఏ పంటలు పండిస్తరు… పంటలు ఎట్ల వస్తున్నయి..
రైతు వెంకటయ్య: సర్ నమస్తే నాపేరు వెంకటయ్య. మాది వనపర్తి మండలం పెద్దగూడెం. కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నా. ఇక్కడ ప్రధానంగా వరి, పల్లి పండిస్తం. గతంలో ఎకరాకు 25 నుంచి 30 బస్తాల వడ్లు వచ్చేవి. ఈసారి కాలం బాగున్నది. ఎకరాకు 50 బస్తాల వరకు వచ్చింది. పల్లీ కూడా ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్ల వరకు పండింది. దేవుని దయ వల్ల ప్రకృతి కరుణించి మంచి పంటలు పండినయి సర్. పోయిన ఏడాది అకాల వర్షాల వల్ల నష్టపోయినం. ఈసారి బాగుంది సర్. 2016 నుంచి పుష్కలంగా సాగునీరు, 24 గంటల కరెంటు రావడంతో మంచి పంటలు పండుతున్నాయి సర్.
సీఎం: పల్లికి ధర ఎట్లుంది..
రైతు వెంకటయ్య: పల్లికి మద్దతు ధర రూ. 6 నుంచి రూ. 7వేల వరకు ధర వచ్చింది సర్. బాగానే గిట్టుబాటు అవుతున్నది.
సీఎం: కేంద్రం వడ్లు కొనమంటున్నది. ఏం చేద్దాం వెంకటయ్య…
రైతు : మా వ్యవసాయ మంత్రి చూసుకుంటడు సర్
సీఎం: కేంద్రం తీసుకోమంటే మీ మంత్రి ఏం చేస్తడు వెంకటయ్య. వాళ్లు ససేమిరా ధాన్యం కొనమంటున్నరు.
సీఎం: మీదేఊరు.. ఎన్ని ఎకరాలుంది ఏం సాగు చేసినవ్
కీమ్యానాయక్: నమస్తే సర్. పక్కన్నే కనిపించే విలియంకొండ తండా మాది. నాకు ఎకరా పొలం ఉంది. వడ్లు పండించినా. కొంచె ఆలస్యం అవ్వడం వల్ల వర్షానికి కొంత నష్టపోయినా. కష్టపడి పంటలు పండించుకుంటం.
సీఎం: మీదెక్కడమ్మ. ఏం పంట వేసిండ్రు..
కృష్ణమ్మ: సార్ నాపేరు కృష్ణమ్మ. మాది పక్కనున్న తండానే. మూడు ఎకరాల పొలం
ఉంది. నీళ్లు బాగా వస్తున్నయి. వరి, పల్లీలు
వేసినం. వర్షం వల్ల కొంత నష్టపోయినం
సార్. పల్లికి కొంచెం తెగులు వచ్చింది.