
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకన్న స్వామి బ్రహ్మోత్సవానికి వేళైంది. కేటీ దొడ్డి మండలంలోని పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇందుకోసం ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే జాతర ప్రాంగణంలో గుడారాలు వెలిశాయి.
కేటీదొడ్డి, నవంబర్ 2 : మండలంలోనే అతి పెద్ద జాతరగా పేరొందిన పాగుంట లక్ష్మీవేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతున్నది. ప్రతి ఏటా దీపావళి ముందు రోజు నుంచి పది రోజులపాటు ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ మేరకు బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. పాగుంట వెంకటాపురం గ్రామంలో వెలసిన స్వామివారికి ఆలయ కమిటీ చైర్మన్ నాగర్‌దొడ్డి వెంకట్రామిరెడ్డి, ఈవో పురేందర్, ఆలయ పెద్దలు, భక్తుల సహకారంతో సుమారు ఎనిమిది కిలోల వెండితో తొడుగు చేయించారు. ఇటీవల ఆలయానికి నూతన చైర్మన్‌తోపాటు కమిటీని నియమించారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. తొలిరోజు విష్ణు సహస్రస్తోత్ర నామపారాయణం, కల్యాణోత్సవం, ప్రభోత్సవం, ధ్వజారోహణం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఆలయ ప్రాంగణంలో ఇప్పటికే వివిధ రకాల అంగళ్లు వెలిశాయి. పిల్లల కోసం ప్రత్యేకంగా ఆటల ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ ఇతర ఆటలకు సంబంధించి నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమావాస్య రోజున నిర్వహించనున్న స్వామివారి కల్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో తరలిరానున్నారు. స్వామివారికి దాసంగాలు సమర్పించేందుకు గ్రామస్తులు సన్నద్ధమవుతున్నారు.
బ్రహ్మోత్సవాల వివరాలు..
పాగుంట వెంకన్న స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రత్యేక పూజలతో ప్రారంభం కానున్నాయి. గురువారం స్వామివారి కల్యాణోత్సవం, ప్రభోత్సవం, శుక్రవారం రథోత్సవం, శనివారం స్వామి వారి పల్లకీ సేవ నిర్వహించనున్నారు.
రైతు సంబురాలతో మరింత జోష్..
ప్రతి ఏటా జాతర సందర్భంగా రైతు సంబురాలు నిర్వహించడం ఆనవాయితీ. కాగా, కరోనా కారణంగా గతేడాది రైతు సంబురాలు నిర్వహించలేదు. ఈ ఏడాది సంబురాలు ఉండడంతో మరింత జోష్ పెరిగింది. 7న ఆరు పళ్ల విభాగం, 8న న్యూకేటగిరీ విభాగం, 9న సబ్ జూనియర్స్ విభాగం, 10న సీనియర్ విభాగాలకు పోటీలు నిర్వహించనున్నారు.
ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు..
ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాగుంట వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు బుధవారంతో ప్రారంభం కానున్నాయి. భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఆలయ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకుంటారు.
ఎమ్మెల్యే సహకారంతో..
ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సహకారంతో జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. నడిగడ్డ ఆరాధ్య దైవం పాగుంట స్వామి బ్రహ్మోత్సవాలకు గ్రామంలో అన్ని ఏర్పాట్లు చేశాం. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం. ఎమ్మెల్యే సహకారంతో ఈ ఏడాది రైతు సంబురాలు చేపడుతున్నాం.