చెన్నై: తమిళనాడులోని కల్లకురుచ్చి జిల్లాలో ఆదివారం భీకర హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. చిన్నసేలం సమీపంలోని కనియామూర్లో ఉన్న ఓ రెసిడెన్సియల్ పాఠశాలకు చెందిన 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై బాధిత బంధువులు, వారి గ్రామస్థులు దాదాపు 2 వేల మంది పాఠశాలను ముట్టడించి భారీ ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ఇవాళ మద్రాసు హైకోర్టులో విచారణ జరిగింది. కల్లకురిచ్చిలో హింసకు పాల్పడిన వ్యక్తులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆందోళనకారులు వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్లు కోర్టు తెలిపింది. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆ నిందితులను పట్టుకోవాలని కోర్టు ఆదేశించింది.
ఇక బలవన్మరణానికి పాల్పడిన విద్యార్థిని మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టమ్ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎన్ సతీశ్ కుమార్ ఈ కేసులో తీర్పునిస్తూ.. శాంతియుతంగా జరుగుతున్న నిరసన ప్రదర్శనలు ఒక్కసారిగా ఎలా హింసాత్మకంగా మారాయాని ప్రశ్నించారు. ఇది వ్యవస్థీకృత నేరం అవుతుందన్నారు. విద్యార్థిని మృతిపై సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతున్నవారిని విచారించాలని కోర్టు కోరింది. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే కోర్టులు, పోలీసులు ఎందుకని జస్టిస్ సతీశ్ అడిగారు. మృతిచెందిన విద్యార్థినికి రీ పోస్టుమార్టమ్ నిర్వహించాలని తండ్రి పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు అనుమతించింది. రెండోసారి పోస్టుమార్టమ్ ముగిసిన తర్వాత మృతదేహానికి దహనసంస్కారాలు నిర్వహించాలని తల్లితండ్రులకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది.