భోపాల్, జనవరి 29: మధ్యప్రదేశ్లో మధుసూదన్ దకడ్ అనే రైతు టమాటాలు పండించి కోట్లు సంపాదించానని ప్రకటించడం సంచలనం కలిగించింది. ఆ రాష్ట్రమంత్రి కమల్ పటేల్ స్వయంగా హర్డా జిల్లాలోని సిరఖంబా గ్రామానికి వెళ్లి అతనితో మాట్లాడారు. 60 ఎకరాల్లో మిరప, 70 ఎకరాల్లో టమోటా, 30 ఎకరాల్లో అల్లం వేశానని రైతు వివరించాడు. సుమారు రూ.8 కోట్ల మేరకు టమాటాలు అమ్మినట్టు ఆ రైతు మంత్రికి చెప్పారు. సహజంగానే దీనిపై మీడియాలో చాలా హల్చల్ నడిచింది. రైతుల అదృష్టమే అదృష్టమని జనం అనుకున్నారు. అయితే ఎంపీలో వ్యవసాయం అంత లాభసాటిగా ఏమీ లేదని ఇతర రైతులు అంటున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రానంత స్థాయికి ధరలు పడిపోవడంతో టమాటాలు, బొప్పాయిలు పారబోస్తున్నట్టు అనేకమంది రైతులు మీడియాకు చెప్పారు. కరోనా సంక్షోభం వల్ల ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ధరలు పడిపోయాయని వారు వాపోతున్నారు. ఇలా ఒక రైతు విజయగాథతో అనేకమంది రైతుల దీనగాథలు వెలుగులోకి వచ్చాయి. శీతల గిడ్డంగులకు సమస్యగా ఉండడం రైతుల నష్టాలకు మరో కారణం. 75 లక్షల టన్నుల పండ్ల దిగుబడి ఉంటే 10 లక్షల టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగిన గిడ్డంగులు ఉన్నాయి.