హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): నేటి మహిళలు చాలా మంది తమ శక్తిని తక్కువగా అంచనా వేసుకొని కుంగిపోతున్నారని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (కొవె) వైస్ ప్రెసిడెంట్ మధు త్యాగి ఆవేదన వ్యక్తం చేశారు. విజయానికి ఆత్మన్యూనతే ప్రథమ అవరోధమని స్పష్టం చేశారు. దీన్ని అధిగమించి వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకొనే మహిళలకు కొవె చేయూతనిస్తున్నదని తెలిపారు. కొవె 17వ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం బేగంపేటలోని కార్యాలయంలో మహిళా పారిశ్రామికవేత్తల సమావేశాన్ని నిర్వహించారు.
కొవె తెలంగాణ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మధు త్యాగి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మహిళా పారిశ్రామికవేత్తలకు కొవె వెన్నెముకలా నిలుస్తున్నదని తెలిపారు. పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని కొవె తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు జ్యోత్స్న, జాయింట్ సెక్రటరీ నీరజ గోడవర్తి పేర్కొన్నారు. ఆర్థిక, వాణిజ్య వ్యవహారాలతోపాటు ఆరోగ్యంపై కూడా మహిళలు దృష్టి సారించాలని స్పర్శ్ సీఈవో రామ్మోహన్రావు సూచించారు. అనంతరం వ్యాపారంలో రాణిస్తూ మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తున్న గీత (ఆల్విన్ కాలనీ), గాయత్రి (మల్కాజిగిరి)కి జ్ఞాపికలు అందజేసి అభినందనలు తెలిపారు. దాదాపు 40 మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.