కీవ్, మార్చి 22: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోవాలన్న రష్యా ప్రయత్నాలను జెలెన్స్కీ సేనలు ఎప్పటికప్పుడు తిప్పి కొడుతున్నాయి. రాజధాని శివార్లలోని మక్రీవ్ నుంచి రష్యా బలగాలను తరిమికొట్టి ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్టు ఉక్రెయిన్ రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది. మరోవైపు, మరియుపోల్‌ను అప్పగించాలన్న తమ డిమాండ్‌ను ఉక్రెయిన్ తిరస్కరించడంతో పుతిన్ సేనలు మరింతగా రెచ్చిపోయాయి. భవనాలు, వాణిజ్య సముదాయాలపై బాంబుల వర్షం కురిపించాయి. దీంతో నగరం నుంచి పౌరులను తరలించే కార్యక్రమాలకు అంతరాయం కలిగింది.
తాగడానికి నీరు, తినడానికి ఆహారంలేక ఎంతోమంది చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని, డీహైడ్రేషన్‌తో పలువురు చిన్నారులు ఇప్పటికే మరణించినట్టు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని పలు నగరాల్లో ఆహార నిల్వలు అయిపోతున్నట్టు స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆహారం గరిష్టంగా 3-4 రోజులకే సరిపోతుందని, 70 శాతం మంది ప్రజలు ఆహారంలేక అలమటిస్తున్నట్టు మెర్సీ కార్ప్స్ ఏజెన్సీ పేర్కొంది. రష్యా దాడుల్లో సాధారణ ప్రజలతో పాటు మూగజీవాలు కూడా మృత్యువాత పడుతున్నాయి. హోస్టోమెల్పై జరిపిన బాంబు దాడుల్లో అనేక గుర్రాలు సజీవ దహనమయ్యాయని ఉక్రెయిన్ తెలిపింది.
భయపడుతున్నట్టు ఒప్పుకోండి: జెలెన్స్కీ
కూటమిలో చేర్చుకోవాలన్న తమ విజ్ఞప్తిని ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతున్న నాటోపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కూటమిలో చేర్చుకోండి లేదా రష్యాకు భయపడి చేర్చుకోలేకపోతున్నామని ఒప్పుకోండి’ అని పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో నేరుగా చర్చలు జరుపాలని, భేటీ అయితే తప్ప యుద్ధం ముగియదన్నారు.
చక్కెర కోసం రష్యన్ల తోపులాట!
పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై క్రమంగా పెరుగుతున్నది. నిత్యావసరాల కొనుగోళ్లపై దుకాణాలు పరిమితులు విధిస్తున్నాయి. చక్కెర ప్యాకెట్ల కోసం ఒకరినొకరు తోసుకుంటున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు, యుద్ధంలో ఇప్పటివరకూ 9,861 మంది రష్యా సైనికులు మరణించారని పుతిన్ సర్కారు అనుకూల న్యూస్సైట్ కొమ్సోమోల్క్సాయ ప్రావ్డా వెల్లడించింది. తర్వాత వెంటనే ఆ కథనాన్ని తొలగించింది.