న్యూఢిల్లీ, మార్చి 16 : దేశంలో ఎల్పీజీ సంక్షోభం సోమవారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. రాజ్యసభలో అధికార, విపక్షాలు మధ్య మాటల యుద్ధం సాగింది. ‘ఇది ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే. ఇరాన్ యుద్ధంతో ఇంధన సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయని ముందే తెలిసినా కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టలేదు’ అంటూ విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్యసభ జీరో అవర్‌లో విపక్షాలు ఎల్పీజీ అంశాన్ని లేవనెత్తాయి. రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, కేంద్రం ముందస్తు ప్రణాళిక లేకపోవటమే దేశంలో ఎల్పీజీ సంక్షోభానికి కారణమని ఆరోపించారు. దేశంలో ఎల్పీజీ కొరతే లేదని లోక్‌సభలో కేంద్రం ప్రకటించిందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన కేంద్రం తీరుపై మండిపడ్డారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తెలిసి కూడా.. మోదీ సర్కార్ ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ‘కేంద్ర ప్రభుత్వ దారుణమైన నిర్వహణ, లోపభూయిష్ఠమైన విదేశాంగ విధానం ఫలితమే ఎల్పీజీ సంక్షోభం. సభలో దీనిపై సమగ్ర చర్చ జరపాలి’ అని ఖర్గే డిమాండ్ చేశారు. దీనిపై కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ, ఒక జాతీయ సంక్షోభాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశంలో ఎల్పీజీ కొరత పశ్చిమాసియా యుద్ధం వల్ల ఏర్పడిందని, దీంట్లో భారతదేశానికి ఎలాంటి పాత్రా లేదని అన్నారు. దేశం యావత్తు నెలకొన్న పరిస్థితులపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయగా, అధికార, విపక్షాల నడుమ మాటల యుద్ధం కొనసాగింది. ఎల్పీజీ సంక్షోభం దేశమంతా ఉందని, గ్యాస్ సిలిండర్లు సరఫరా లేక సాధారణ గృహాలు, చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఎంఎస్ఎంఈలు.. అనేకచోట్ల పనులన్నీ ఆగిపోయాయని ఖర్గే అన్నారు.
దేశంలో ఎల్పీజీ సంక్షోభం కొనసాగుతున్నది. కొరత లేదని ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అనేక రాష్ర్టాల్లో ప్రజలు ఇప్పటికీ గ్యాస్ కోసం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. ఎల్పీజీ సంక్షోభానికి వ్యతిరేకంగా కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ భారీ ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ కొరతతో ఇండక్షన్, కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగింది. గత కొన్ని రోజుల్లో వీటికి 400-500 శాతం గిరాకీ పెరిగినట్టు డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు చెందిన ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్ యాప్ ఇండియన్ ఆయిల్ వన్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో చాట్‌జీపీటీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచింది.

దేశంలో ఇంధన అవసరాలు పెరిగిన వేళ ఎల్పీజీ ట్యాంకర్ శివాలిక్ సోమవారం సురక్షితంగా భారత్‌కు చేరింది. 40 వేల టన్నుల వంట గ్యాస్‌ను మోసుకొచ్చిన ఈ నౌక గుజరాత్‌లోని ముంద్రా నౌకాశ్రయంలో లంగరు వేసింది. ఇరాన్‌తో దౌత్య పరమైన చర్చలు ఫలించడంతో హొర్ముజ్ జలసంధి గుండా ఈ నౌకను భారత నౌకాదళం క్షేమంగా గమ్యస్థానానికి తీసుకు రాగలిగింది.
దేశంలో ఎల్పీజీ కొరత కొనసాగుతున్న వేళ బెంగళూరు కెఫె ఒకటి నిమ్మరసంపై 5 శాతం గ్యాస్ సంక్షోభం చార్జి విధించడం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. థియో కెఫె కస్టమర్‌కు అందించిన బిల్ ప్రకారం రెండు నిమ్మ రసాలకు కలిపి గ్యాస్ క్రైసిస్ చార్జ్ కింద రూ.17.01 వసూలు చేశారు. దీంతో మొత్తం బిల్ రూ.358 అయ్యింది. ఈ బిల్‌పై 5 శాతం రాయితీ కూడా ఇచ్చారు. దీంతో చివరకు జీఎస్టీ కలుపుకొని తుది బిల్లు రూ.374 అయ్యింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘నిమ్మ రసాన్ని వేడి చేసి ఇచ్చాడా?’, ‘ఆ జ్యూస్ తయారీలో ఏం గ్యాస్ వాడారు’? అని కామెంట్లు చేశారు.