జవహర్‌నగర్, డిసెంబర్ 25 : ప్రేమపేరుతో యువకుడి వేధింపులకు మనస్తాపం చెందిన ఓ యువతి యాసిడ్‌తాగి తనువు చాలించింది. ఈ సంఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. కుషాయిగూడ ఏసీపీ మహేశ్‌కుమార్, జవహర్‌నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం… దమ్మాయిగూడ పరిధి, న్యూ భవానీనగర్‌లో పొనగంటి తానేశ్.. భార్య పద్మ, కుమార్తె పూర్ణిమ, కుమారుడితో కలిసి నివసిస్తున్నా రు. తల్లిదండ్రులు కూలీపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. పూర్ణిమ(19) ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 24న కళాశాల వెళ్లి ఇంటికి వచ్చిన పూర్ణిమ పిల్లలకు ట్యూషన్ చెబుతున్న క్రమంలోనే వాష్‌రూమ్‌కి వెళ్లి యాసిడ్ తాగి ఇంట్లో పడుకుంది. యాసిడ్ తాగానని పిల్లలకు చెప్పడంతో వారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా… చికిత్స పొందుతూ పూర్ణి మ మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు మొదట యువతి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశారు… పోలీసుల విచారణలో భా గంగా ఓ యువకుడి వేధింపులతోనే మృతి చెందింద ని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పూర్ణిమను వేధింపులకు గురిచేసిన నిఖిల్ అనే నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని యువతి కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్ ముందు నిరసనకు దిగారు. నిఖిల్‌ను కఠినంగా శిక్షించాలని… మా కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సమాజంలో తమ బిడ్డకు జరిగిన అన్యాయం… మరే ఆడపిల్లకు జరగవద్దని… ఇలాంటి నిందితుడికి సరైన శిక్షను విధించాలని వారు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏసీపీ మహేశ్‌కుమార్, ఇన్స్పెక్టర్ వచ్చి యువతి కుటుంబసభ్యులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితుడిని పట్టుకునేందుకు 4 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.