న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఇవాళ విపక్షాలు ఆందోళన సృష్టించాయి. లోక్‌సభలో విపక్ష ఎంపీలు ప్లకార్డులతో స్పీకర్ చైర్ వద్ద ప్రదర్శన చేపట్టారు. జీఎస్టీ పెరుగుదల, ద్రవ్యోల్బణం, డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం వంటి అంశాలను చర్చించాలంటూ ఆందోళన చేపట్టారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని నినాదాలతో అడ్డుకున్నారు. ఆ సమయంలో పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఇది సరైన మార్గం కాదు అని, మెజారిటీ ఎంపీలు క్వశ్చన్ అవర్ కోరుతున్నారని, పార్లమెంట్ నడవడం మీకిష్టం లేదా, కాంగ్రెస్ దీనిపై క్లారిటీ ఇవ్వాలని అన్నారు. విపక్ష సభ్యులు ఎంతకూ తగ్గకపోవడంతో స్పీకర్ ఓం బిర్లా జోక్యం చేసుకున్నారు. నినాదాలతో హోరెత్తిస్తున్న వారంతా చర్చల్లో పాల్గొనాలని బిర్లా సూచించారు. పార్లమెంట్ నడవాలని ప్రజలు కోరుకుంటున్నారని బిర్లా అన్నారు. ఆ తర్వాత సభకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరో వైపు రాజ్యసభలోనూ విపక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో సభను మధ్యాహ్నం 2 వరకు వాయిదా వేశారు.