Telangana | హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): వేలం పాటలో దక్కించుకున్న ధాన్యం తరలిం పు విషయంలో బిడ్డర్లు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం పౌర సరఫరాల సంస్థకు శాపంగా మారుతున్నది. వేలం ధాన్యం తరలింపు ఆలస్యమైనా కొద్దీ పౌరసరఫరాల సంస్థపై వడ్డీల భారం పెరిగిపోతున్నది. అయినప్పటికీ, వేలం లో విక్రయించిన ధాన్యం లిఫ్టింగ్ (ఎత్తేందు కు) గడువును మరో మూడు నెలలపాటు పొడిగించేందుకు పౌరసరఫరాల సంస్థ కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించిన ఫైల్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న ట్టు తెలిసింది. అదే జరిగితే పౌరసరఫరాల సంస్థపై పడుతున్న వడ్డీల భారం రూ.మూడు వేల కోట్లకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. నిజానికి వేలం వేసిన ధాన్యాన్ని తరలించేందుకు బిడ్డర్లకు ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 23తో ముగియనున్నది. కానీ, బిడ్డర్లు ఇప్పటివరకు 20 శాతం ధాన్యాన్ని మాత్రమే తరలించినట్టు తెలుస్తున్నది.
మిగిలిన ధాన్యాన్ని తరలించే గడవును మరో 3నెలల పాటు పొడిగించాలని బిడ్డర్లు ప్రభుత్వం వద్ద పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నట్టు చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారం పౌరసరఫరాల సంస్థలో హాట్‌టాపిక్‌గా మారింది. సంస్థకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ గడువు పెంపునకే ఎందుకు మొగ్గు చూపుతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23 యాసంగి సీజన్‌కు సంబంధించిన 35 లక్షల టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఫిబ్రవరిలో వేలం వేయగా,4 కంపెనీలు దక్కించుకున్నాయి. వీరికి ఫిబ్రవరి 23న వేలం కన్ఫర్మేషన్ లెటర్‌ను అందించింది. ఈ లెటర్ అందిన తేదీ నుంచి 90 రోజుల్లోగా మిల్లుల్లోని ధాన్యాన్ని మొత్తం ఖాళీ చేయాలని స్పష్టంచేసింది. ఇప్పటివరకు సుమారు 20% లోపు ధాన్యం మాత్రమే తరలించినట్టు తెలిసింది. దీంతో మిగిలిన ధాన్యం తరలించే గడువును మరో మూడు నెలలపాటు పొడిగించాలని బిడ్డర్లు పౌరసరఫరాల సంస్థను కోరినట్టు తెలిసింది. ఇందుకోసం బిడ్డర్లు లాబీయింగ్ చేస్తున్నారని, ‘పెద్దలందర్నీ’ సంప్రదించి ‘సెట్’చేసే పనిలో పడినట్టు పౌరసరఫరాల సంస్థలో జోరుగా చర్చ జరుగుతున్నది. గడు వు పెంపు దాదాపుగా ఖరారైందని, ఉత్తర్వులు వెలువడటమే ఆలస్యమని తెలిసింది.
సివిల్ సైప్లె పై 3 వేల కోట్ల వడ్డీ భారం
ఒకవైపు, పౌరసఫరాల సంస్థ సుమారు రూ.70 వేల కోట్ల అప్పుల్లో ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నది. ఈ అప్పులను తగ్గించే చర్యలు చేపట్టకుండా మరింత పెంచేలా వ్యవహరిస్తున్నదనే విమర్శలున్నాయి. వేలం వేసిన ధాన్యం లిఫ్టింగ్ గడువును మరో మూడు నెలలపాటు పొడిగిస్తే సంస్థకు భారీ మొత్తంలో ఆర్థిక నష్టం కలుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. వేలంలో విక్రయించిన ధాన్యం విలువ సుమారు రూ.7 వేల కోట్లు. కానీ, బిడ్డర్లు ధాన్యం ఎత్తడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ డబ్బులు పౌరసరఫరాల సంస్థకు అందలేదు. దీంతో పౌర సరఫరాల సంస్థపై నెలకు కనీసం రూ.500 కోట్ల చొప్పున వడ్డీల భారం పడుతున్నది. గడిచిన మూడు నెలలకు పౌర సరఫరాల సంస్థపై దాదాపు రూ.1,500 కోట్ల మేర వడ్డీల భారం పడగా, గడువును మరో మూడు నెలలపాటు పొడిగిస్తే ఈ భారం రూ.3 వేల కోట్లకు చేరుతుందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ధాన్యం వేలం వేసిన డబ్బు లు రాకపోగా, వడ్డీ భారం కూడా సంస్థపై పడటంతో మరింత ఆర్థికనష్టం పెరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వానికి అప్పులు తగ్గించాలనే చిత్తశుద్ధి ఉంటే.. ఈ విధంగా చేయబోదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లర్లతో బేరసారాలు
ధాన్యం ఎత్తడంలో బిడ్డర్లు కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బహిరంగ మార్కెట్లో ధాన్యం విలువ పడిపోవడంతో ఇప్పుడీ ధాన్యం ఎత్తితే నష్టం వస్తుందనే ఆలోచనలో వారు ఉన్నట్టు తెలిసింది. అందుకే కాలయాపన చేస్తున్నారనే విమర్శలున్నాయి. దీనికి తోడు ధాన్యం ఎత్తడం, ట్రాన్స్పోర్ట్ పెట్టి ఎక్కడో విక్రయించడం.. ఇలాంటి తలనొప్పుల కన్నా.. ఎక్కడి ధాన్యం అక్కడే ఉంచేసి పేపర్లపై అమ్మకాన్ని చూపించేవిధంగా బిడ్డర్లు ప్లాన్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ధాన్యం ఉన్న మిల్లర్లతో బిడ్డర్లు బేరసారాలు సాగిస్తున్నట్టు తెలిసింది. ‘మీ ధాన్యం మీ దగ్గరే ఉంచుకోండి. ఆ ధాన్యానికి ఎంత ధర అవుతుందో అంత మొత్తం మాకు చెల్లించండి’ అంటూ ప్రతిపాదనలు పంపుతున్నట్టు మిల్లర్ల వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ మిల్లర్ల వద్ద ధాన్యం లేకుంటే ముక్కుపిండి మరీ అందుకు సంబంధించిన డబ్బులను వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ విధంగా ధాన్యం ఎత్తకుండానే ఎక్కడి ధాన్యం అక్కడే ఉండగానే మొత్తం కార్యక్రమం పూర్తి చేసే విధంగా భారీ స్కెచ్ వేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.