నిండు
నూరేండ్లు నిండిపోయినా
నిత్య యవ్వనంగా నిలిచిపోయిన
ఆకుపచ్చని నీ అసమాన ప్రతిభకు దక్కిన
అరుదైన గౌరవం నీ కీర్తి కిరీటంలో
అలంకరించబడిన మెరుగైన వెలుగు పువ్వు
దేశం
తలెత్తి నిన్ను చూస్తుంది
పుట్టమన్ను లాంటి
నీ అక్షరాలను దోసిట్లో పట్టుకొని
తంగేడు పూల విజ్ఞాన పరిమళాలను
ఆస్వాదిస్తుంది
హైదరాబాద్
ముసిముసిగా మురిసిపోతుంది
ఎర్రని జాజిపూతల తన బిడ్డ ఎదిగిపోయిందని
భారత శిఖరాగ్రాన ఒదిగిపోయిందని
మూసి
నీ ముందల దోసిలి పట్టింది.
ఇన్ని తేట నీళ్లిస్తే
ఈ కార్పొరేట్ మురికినంత కడుక్కుందామని
నీతో పోటీగా సాగి అందరి
గొంతులు తడుపుదామని
అమ్మా
నీ చరిత నల్ల గొంగడంత స్వచ్ఛమైనది.
బోధి వృక్షమంత విస్తారమైనది.
నీవు తెలంగాణమ్మ సిగలోన బతుకమ్మవి
మైసమ్మ బోనం పటువ మీద పసుపు
కుంకుమ మెతుకమ్మవి
నీ సనుబాలు తాగిన
పిల్లలంతా నిన్నే పలవరిస్తుండ్రు.
రెక్కలు కట్టుకుని మళ్లొచ్చి
నీ ఒడిలో వాలిపోదామని!
నీ ఎద మీద ఎలిగిపోదామని!!
చిక్కొండ్ర రవి
95023 78992
(ప్రభుత్వ సిటీ కళాశాలకు అత్యున్నత గ్రేడ్ ఏ ++ వచ్చిన సందర్భంగా…)