తెలుగు యూనివర్సిటీ, డిసెంబర్ 12 : తెలుగు భాషా సాహిత్యాలకు దశాబ్దాలుగా అవిరళకృషి చేస్తున్న డాక్టర్ ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్యకు ఆదివారం శాంతా వసంత ట్రస్టు సాహిత్య పురస్కారాలను ప్రకటించింది. పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ కె.ఐ వరప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంత ట్రస్టు పురస్కారాలను ఈనెల 18న సాయంత్రం 6గంటలకు ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఎల్లూరి శివారెడ్డికి డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని, డాక్టర్ జె. చెన్నయ్యకు తెలుగు భాషా సేవా రత్న పురస్కారాన్ని అందజేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ఒక్కొక్కరికి పురస్కారం కింద లక్ష రూపాయల నగదు, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రంతో సత్కరించనున్నారు.