బ్యూనస్ఎయిర్స్ (అర్జెంటీనా) : రెండు దశాబ్దాల పాటు తనదైన విన్యాసాలతో సాకర్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ తన జాతీయ జట్టుకు వీడ్కోలు పలికేందుకు సమయం ఆసన్నమైంది. రెండున్నర నెలల క్రితం ముగిసిన ఫిఫా ప్రపంచకప్ తర్వాత గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించిన ఈ లెజెండరీ ప్లేయర్.. తన దేశం తరఫున ఆఖరాట ఆడేందుకు సిద్ధమయ్యాడు. తన ఫేర్వెల్ మ్యాచ్ను అతడు బెనిన్తో ఆడనున్నాడు.
బ్యూనస్ఎయిర్స్లోని ప్రఖ్యాత ఎస్టాడియొ మాస్ మాన్యుమెంటల్ స్టేడియంలో తమ అభిమాన ఆటగాడి ఆటను అర్జెంటీనా జెర్సీలో ఆఖరిసారి చూసేందుకు గాను సుమారు 85 వేల మంది ప్రేక్షకులు రానున్నట్టు అంచనా. 2022 ఫిఫా ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా జట్టులోని సభ్యులంతా వారి కుటుంబసభ్యులతో కలిసి ఈ మ్యాచ్ను చూడనున్నారు. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 4.30 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను మనదేశంలో జీ5 లో లైవ్ చూడొచ్చు.