న్యూఢిల్లీ : అమెరికా ఫాస్ట్ బౌలర్ అలీ ఖాన్ వేసిన విచిత్రమైన డెలివరీ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. కెనడా సూపర్60 (టీ10) టోర్నీలో టొరంటో సిక్సర్స్, మిసిసాగ మాస్టర్స్ మధ్య సెమీస్‌లో మాస్టర్స్ పేసర్ అలీ ఖాన్ వేసిన బంతి పిచ్‌పై పడిన తర్వాత ఊహకందని రీతిలో బౌన్స్ అయింది. బ్యాటర్ కీరన్ పొలార్డ్, కీపర్‌కు అందకుండా నేరుగా బౌండరీ అవతల పడింది. అంపైర్ దీన్ని వైడ్ బాల్‌గా ప్రకటించాడు. బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లడంతో మరో ఆరు కలిపితే ఏడు రన్స్ వస్తాయిని అంతా అనుకున్నారు.
కానీ, అంపైర్ దాన్ని వైడ్ కమ్ ఫోర్‌గా ప్రకటించడంతో ఐదే వచ్చాయి. ఎంసీసీ నిబంధనల ప్రకారం బంతి బ్యాట్‌కు తగలకుండా ఏ విధంగా బౌండరీ లైన్ దాటినా దాన్ని ఫోర్‌గానే పరిగణిస్తారు. దాంతో టొరంటో జట్టుకు ఐదు రన్స్ లభించాయి. అయితే, నేరుగా బౌండరీ రోప్ అవతల పడేంత బౌన్స్ అయిన ఈ డెలివరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు, క్రీడా విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.