హైదరాబాద్ ఆట ప్రతినిధి : ఆసియా గేమ్స్‌లో 5 స్వర్ణాలు సహా 9 పతకాలతో సత్తాచాటిన భారత స్టార్ ఆర్చర్లు హైదరాబాద్ వేదికగా ఈ నెల 8 నుంచి జరిగే ఆర్చరీ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్లో ప్రపంచ దిగ్గజాలతో కలిసి బరిలోకి దిగనున్నారు. ఆసియాడ్‌లో భారత్ కోసం కలిసి ఆడి పతకాలు సాధించిన ఆర్చర్లంతా ఇప్పుడు లీగ్‌లో వేర్వేరు ఫ్రాంచైజీల తరఫున ప్రత్యర్థులుగా తలపడనున్నారు.
ఆసియాడ్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పసిడి గెలిచి చరిత్ర సృష్టించిన 17 ఏండ్ల కుంకుమ్ మొహోద్, రెండేసి స్వర్ణాలు సాధించిన తానిపర్తి చికిత, సాహిల్ రాజేశ్ జాధవ్, స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తదితరులు ఈ లీగ్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. 6 ఫ్రాంచైజీల్లో మొత్తం 48 మంది ఆర్చర్లు బరిలో ఉన్నారు. ఆసియా గేమ్స్ లో భారత్ సాధించిన అద్భుత విజయం ఏపీఎల్ రెండో సీజన్ కు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందని లీగ్ డైరెక్టర్ అనిల్ కామినేని అన్నారు.