e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియర్‌

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు లైన్‌క్లియర్‌

  • గత జీవో అమలుకు హైకోర్టు పచ్చజెండా
  • రిట్‌ కొట్టేసిన విషయం దాచడంపై ఆగ్రహం
  • పిటిషనర్లకు రూ. వేయి చొప్పున జరిమానా
  • జీవో 16పై పిల్‌ను కొట్టేసిన ధర్మాసనం
  • కార్యరూపం దాల్చనున్న ప్రభుత్వ సంకల్పం
  • కాంట్రాక్టు ఉద్యోగ సంఘాల హర్షం

హైదరాబాద్‌, డిసెంబర్‌ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు శుభవార్త. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016లో జారీచేసిన జీవో 16ను అమలుచేయాలని హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. జీవో 16ను సవాల్‌చేస్తూ దాఖలైన ఇంప్లీడ్‌ పిటిషన్‌ కొట్టివేసింది. ఒక రిట్‌ను కొట్టేసిన విషయాన్ని దాచడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. హైకోర్టు తీర్పుపై వివిధ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘాలు హర్షం ప్రకటించాయి.

ఇదీ కేసు నేపథ్యం..
రాష్ట్రంలో వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 26న జీవో 16 జారీచేసింది. 2014 జూన్‌ రెండుకు ముందు పూర్తిస్థాయి కాంట్రాక్ట్‌ పద్ధతిలో నెలవారీ పారితోషికం పొందుతున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ఆ జీవోలో మార్గదర్శకాలు పొందుపరిచారు. ఆ జీవోను వ్యతిరేకిస్తూ నక్కల గోవింద్‌రెడ్డి, జే శంకర్‌ 2017లో పిల్‌ను దాఖలుచేశారు. ఇదే కేసులో ఇంటర్‌విద్యలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు సైతం ఇంప్లీడ్‌ అయ్యారు. ఈ వ్యాజ్యాలను 2021 ఫిబ్రవరిలో అప్పటి చీఫ్‌ జస్టిస్‌ హిమాకోహ్లీ నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ విచారణ సమయంలో, కాంట్రాక్టు ఉద్యోగులుగా చేయనివాళ్లు జీవో 16ను ఎలా సవాల్‌ చేస్తారని ప్రశ్నించింది. 2016లో దాఖలు చేసిన రిట్‌ను డిస్మిస్‌ చేస్తూ తీర్పు చెప్పింది.

- Advertisement -

ఈ విషయం మంగళవారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీల ధర్మాసనం దృష్టికి వచ్చింది. జీవో 16ను సవాల్‌ చేస్తూ పిటిషనర్లు రెండు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలుసుకున్న హైకోర్టు పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక రిట్‌ను కొట్టేస్తూ తీర్పు చెప్పిన విషయాన్ని గోప్యంగా ఉంచి అప్పటికే దాఖలు చేసిన మరో వ్యాజ్యంపై విచారణ జరిగేలా చేయడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. పిల్స్‌లో ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే లక్ష రూపాయలు తకువ కాకుండా జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

దీంతో పిటిషనర్ల తరఫు సీనియర్‌ న్యాయవాది ఎస్‌ సత్యంరెడ్డి కల్పించుకొని తొలి వ్యాజ్యం దాఖలు చేసిన సమాచారం తనకు తెలియదని, రెండో వ్యాజ్యం వేసినవాళ్లు నిరుద్యోగులని, జరిమానా లేకుండా వదిలిపెట్టాలని కోరారు. పిటిషనర్లు నిరుద్యోగులు కాబట్టి వెయ్యి రూపాయలు చొప్పున మాత్రమే జరిమానా విధిస్తున్నట్టు ధర్మాసనం స్పష్టంచేసింది. జరిమానాను ప్రధాన మంత్రి కొవిడ్‌ సహాయ నిధికి చెల్లించాలని ఉత్తర్వులు జారీచేసింది. రెండో పిటిషన్‌ను కూడా కొట్టేస్తూ మంగళవారం తీర్పు వెలువరించింది. తాజా తీర్పుననుసరించి, ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేయాల్సి ఉన్నది.

పలు సంఘాల నాయకుల హర్షం
హైకోర్టు తీర్పు పట్ల పలు సంఘాల నాయకులు హర్షం ప్రకటించారు. కేసులో సమర్థంగా వాదనలు వినిపించి, పిల్‌ రద్దయ్యేలా చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి కాంట్రాక్ట్‌ లెక్చరర్ల సంఘం -711 నాయకులు కనకచంద్రం, వెంకటేశ్వర్‌రావు, శివప్రసాద్‌, ఆర్జేడీ కాంట్రాక్ట్‌ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకన్న ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు జీ రమణారెడ్డి, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేశ్‌ సైతం తీర్పును స్వాగతించారు. ఇందుకు కృషిచేసిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు తీర్పు చారిత్రాత్మకమని యూనివర్సిటీ టీచర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ స్టేట్‌ (ఉథాట్స్‌) రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్‌ పీ పరశురాం, డాక్టర్‌ బైరి నిరంజన్‌ పేర్కొన్నారు. ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి కన్వీనర్‌ మాచర్ల రామకృష్ణగౌడ్‌, నాయకులు నగేశ్‌, రహీం, జంగయ్య, సుధాకర్‌ సైతం తీర్పు పట్ల హర్షం ప్రకటించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement